తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు

Doors of Kedarnath Dham open to pilgrims

రుద్ర‌ప్ర‌యాగ్‌: ఈరోజు ఉదయం 6.20 నిమిషాలకు జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆల‌యాన్ని తెరుచుకున్నాయి. వేదోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య ఆల‌య ద్వారాల‌ను ప్ర‌ధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమా శంక‌ర్ లింగ శివాచార్య ఓపెన్ చేశారు. సోమ‌వార‌మే కేదార్‌నాథ్ ఆల‌యానికి ఉత్స‌వ మూర్తిని తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌త 72 గంట‌ల నుంచి కేదార్‌నాథ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భీక‌రంగా మంచు కురిసింది. బాబా కేదార్ ద‌ర్శ‌నం కోసం నేడు సుమారు 8 వేల మంది వేచి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కేదారీశ్వ‌రుడి ఆల‌యం ఓపెనింగ్ సంద‌ర్భంగా .. ఆల‌యాన్ని పువ్వుల‌తో ముస్తాబు చేశారు. సుమారు 20 క్వింటాళ్ల పువ్వుల‌తో ఆల‌యాన్ని అలంక‌రించారు. ఈరోజు టెంపుల్‌ను తెర‌వ‌నున్న నేప‌థ్యంలో భారీ సంఖ్య‌లో భ‌క్తులు చేరుకున్నారు. అక్క‌డ మైన‌స్ ఆరు డిగ్రీల టెంప‌రేచ‌ర్ ఉంది. అయినా వేలాది మంది ద‌ర్శ‌నం కోసం నిరీక్షిస్తున్నారు. ఉద‌యం 4 గంట‌ల నుంచి ఆల‌య ద్వారాల ముందు భ‌క్తులు క్యూక‌ట్టారు.

కాగా, రానున్న వారం రోజుల పాటు కేదార్‌ఘాట్ రూట్లో వాతావ‌ర‌ణం చాలా క్లిష్టంగా ఉంటుంద‌ని ఐఎండీ తెలిపింది. సుమారు మూడు లేదా నాలుగు ఫీట్ల మేర స్నోఫాల్ ఉన్న‌ట్లు భావిస్తున్నారు. భారీగా స్నోఫాల్ ఉండ‌డం వ‌ల్ల .. కేదార్‌నాథ్ ఆల‌య ప‌రిస‌రాల్లో ఇంకా మంచును తొల‌గించ‌లేక‌పోతున్న‌ట్లు అధికారులు చెప్పారు. ఇక బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ఈనెల 27వ తేదీన తెర‌వ‌నున్న‌ట్లు ఛార్‌థామ్ యాత్ర అధికారులు చెప్పారు.