సీఎం రేసులో ఉన్నా.. డీకేతో ఎలాంటి ఇబ్బందులు లేవుః సిద్ధ‌రామ‌య్య‌

సీఎం పదవి కోసం తనతో డీకే శివకుమార్ పోటీ పడుతున్నారన్న సిద్ధరామయ్య

siddaramaiah

బెంగళూరుః కర్ణాటక సీఎం రేసులో ఉన్నాన‌ని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేశారు. సీఎం ప‌ద‌వికి త‌న‌తో పోటీ ప‌డుతున్న కేపీసీసీ చీఫ్‌ డీకే శివ‌కుమార్‌తో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని పేర్కొన్నారు. తాను నూరు శాతం సీఎం అభ్య‌ర్ధినేన‌ని, ఇప్పుడున్న ప‌రిస్ధితుల్లో త‌న‌తో పాటు డీకే శివ‌కుమార్ సీఎం ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నార‌ని, అయితే జీ ప‌ర‌మేశ్వ‌ర కూడా సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నాన‌ని గ‌తంలో ప్ర‌స్తావించార‌ని పేర్కొన్నారు.

సీఎం అభ్య‌ర్ధిత్వానికి త‌న‌తో పోటీ ప‌డే వారితో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవని ఆయ‌న చెప్పుకొచ్చారు. మేలో జ‌రిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను కోలార్‌తో పాటు వ‌రుణ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోటీ చేస్తాన‌ని సిద్ధ‌రామ‌య్య తెలిపారు. డీకే శివ‌కుమార్‌తో త‌న‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయ‌ని, ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం పార్టీ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ను ఎన్నుకుంటార‌ని చెప్పారు. సీఎం అభ్య‌ర్ధిని కాంగ్రెస్ ఎన్న‌డూ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించ‌లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ సిద్ధ‌రామ‌య్య చెప్పారు. హైక‌మాండ్ సూచ‌ల‌న‌తో పాటు ఎమ్మెల్యేల అభీష్టం ప్ర‌కారం సీఎల్పీ నేత ఎంపిక ఉంటుంద‌ని అన్నారు. ఇక ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌ల‌ని సిద్ధ‌రామ‌య్య పునరుద్ఘాటించారు.