ప్రజాపంపిణీ వ్యవస్థను పాడుపెట్టొద్దు

ధరల నియంత్రణలో పాలకులు చెప్తున్న మాటలు, చేస్తున్న హెచ్చరికలు క్షేత్రస్థాయిలో పెరుగుతున్నధరలకు పొంతన లేకుండాపోతున్నది. ధరలను నియంత్రిస్తాం, నల్ల బజారులో అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతాం అంటూ పదేపదే చెప్తున్నా ధరలు అదుపులేకుండా పెరిగిపోతు న్నాయి. వారి మాటలు ఎలా కోటలు దాటుతున్నాయో అంతకురెట్టింపు స్థాయిలో ధరలు పెరిగిపోతున్నాయి.

ప్రజాపంపిణీ వ్యవస్థను పాడుపెట్టొద్దు
Public Distribution centre (File)

నియంత్రించే పరిస్థితులు కల్పించడం లేదు. ఒకవేళ ఆదేశించినా చర్యలు తీసుకున్నా అవి అమలు అవ్ఞతా యనే అనుమానం సర్వత్రా వినిపిస్తున్నది.అయితే రైతుల వద్ద ఉత్పత్తులు ఉన్నంతకాలం తగ్గి ఉన్న ధరలను తాము అదుపు చేసినట్టుగా కొందరుపెద్దలు చెప్పుకుంటు న్నారు. రైతుల గడపదాటి ఉత్పత్తులు బయటకు వెళ్లిన మరుక్షణమే ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇదేదోఇప్పుడు కొత్తగా ఆరంభమైంది కాదు. ఈ ధరల పెరుగుదలకు మూలకారణమైన దళారీవ్యవస్థ జోక్యాన్ని నియంత్రించేం దుకు గత రెండు,మూడు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయ త్నాలు ఏమాత్రం సఫలీకృతం కావడం లేదు. ఏ వస్తువ్ఞ ధర తీసుకున్నా రైతుల వద్ద ఉన్నప్పుడు ఆ తర్వాత దళారుల దగ్గరకు చేరి చివరకు వినియోగదారుడికి అందే వరకు దేశవ్యాప్తంగా చూస్తే వ్యత్యాసం కొన్ని వేలకోట్లల్లో ఉంటుందని అనధికార అంచనా.

రైతుల వద్ద పంటలు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో పొలాల నుంచే మార్కెట్‌లకు తీసుకువెళ్లి రైతులు వ్యాపారులకు అమ్ము కుంటున్నారు. మార్కెట్‌ కమిటీలు కూడా రైతుల సంక్షే మాన్ని విస్మరించి వ్యాపారులవైపే మొగ్గుచూపుతున్నారు.

వాస్తవంగా అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయించగలిగితే కొంతవరకైనా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు కష్టాలు తగ్గేవి. ఆ వ్యవస్థ విఫలం కావడం వల్లే ఈ పరి స్థితులు దాపురిస్తున్నాయి.

ఈ వ్యవస్థ ఆవిర్భావానికిఎంతో చరిత్రఉంది. ఇటు ధరలను అదుపు చేసి, అదే సమయం లో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర అందించి మరొకపక్క పేద,బడుగు వర్గాలకు నిత్యావసర వస్తువ్ఞలు సబ్సిడీ కింద అందించే ఉద్దేశ్యంతో ఒక శతాబ్దం కిందే ఆ వ్యవస్థను ఏర్పాటుచేశారు.

అది కాలక్రమేణా ప్రజా పంపిణీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. భారతదేశా నికి సంబంధించి 1880లోతీవ్ర క్షామం ఏర్పడి ఆకలి తీర్చుకోవడానికి సరుకులు లభించక, లభించినా కొనే ఆర్థికస్తోమత లేక వేలాది మంది ఆకలితో ప్రాణాలు వదలడంతో ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం అధికారికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆహారకొరతలు ఎందుకు ఏర్పడుతున్నాయి?

దీనికి మూలకారణాలైన కరవ్ఞలు ఎందుకు వస్తున్నాయి? వాటిని ఎలా నిరోధించాలి? ఆహార ధాన్యాలు ప్రజలకు సరసమైన ధరల్లో ఎలా అందుబాటులో ఉంచాలి? తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నిర్దిష్టమైన సూచనలతో ఆ కమిటీ ఒక నివేదికను ఇచ్చింది. అప్పట్లో ఆ సూచనలను అంతగా పట్టించుకోలేదు.

కానీ 1943లో వచ్చిన కరవ్ఞ దేశాన్ని గడగడలాడించింది. ఆనాటి తీవ్రకరవ్ఞ భారతదేశంలో లక్షల సంఖ్యలో ప్రజలు అసువ్ఞలు బాసారు. ఒక్క బెంగాల్‌లోనే దాదాపు ఆ కరవ్ఞ ప్రభావంతో దాదాపు ముప్ఫైలక్షల మందికిపైగా ప్రాణాలుకోల్పోయారు. దీంతో బ్రిటిష్‌ పాలకులు బెంబేలెత్తి గతంలో తాము నియమించి న కమిటీ ప్రతిపాదనలు బయటకుతీసి అమలు చేయడం ఆరంభించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నారు. దేశంలో టీ,కాఫీ వాడకం పెరిగిపోవడంతో చక్కెర కొరత ఏర్పడడం,దాన్ని కూడా రేషనింగ్‌లో చేర్చారు.దళారీవ్యవస్థను నియంత్రించేందుకు, ధరలు వారి ఇష్టానుసారంగా పెంచకుండా, అలాగే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే సమయంలో తగ్గించ కుండా రైతులకు గిట్టుబాటు ధరలభించాలని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతుధరకు కొనేందుకు భారత ఆహారసంస్థను ఏర్పాటు చేశారు.

అలాగే నల్ల బజారులోకి సరుకులు తరలించకుండాచర్యలు చేపట్టారు. నిత్యావసర వస్తువ్ఞల చట్టాన్ని తీసుకువచ్చారు. అయినా ధరలను నియంత్రించలేకపోతున్నారు. మరొకపక్క రైతు లకు గిట్టుబాటు ధర ఇప్పించడంలో ఘోరంగా విఫల మవ్ఞతున్నారు.చట్టాల్లో కొన్ని లొసుగులు ఉండొచ్చు. వాటికంటే మించి రాజకీయ జోక్యం, అవినీతి, అధికా రుల అసమర్థత వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థ ఇప్పటికీ కొందరికి కల్పతరువ్ఞగా మారి పోయింది.

మధ్యవర్తులు లేకుండా రైతులే తమ ఉత్పత్తు లను నేరుగా వినియోగదారులకు అమ్ముకునే రైతుబజా రలనే సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు. శతకోటి దరిద్రా లకు అనంతకోటి ఉపాయాలన్నట్లు దళారులే రైతుల అవ తారాలు ఎత్తారు.

ఇదంతా అధికారులకు తెలియంది కాదు. ఎవరు రైతో, ఎవరుకాదో పెద్ద పరిశోధన చేసి కనుగొనాల్సిన అంశంకూడా కాదు. పావ్ఞ ఎకరం ఉన్నట్లు రైతుగా పాస్‌పుస్తకం సంపాదించి ఏడాది పొడవ్ఞనా అన్ని రకాల కూరగాయలు అమ్ముకుంటుంటే రైతుతో కాదో అర్థంకావడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. అసలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి గడ్డల ధరలు కిలో రెండువందల రూపాయలకు అమ్మా రంటే పాలకుల అసమర్థత అర్థం చేసుకో వచ్చు.

రెండు మూడు నెలల ముందుగానే ఉల్లికొరత ఏర్పడబోతుందనే విషయం వ్యవసాయ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. వర్షాలు ఆలస్యం కావడంవల్ల ఉల్లిగడ్డ కుల్లిపోవ డం,దిగుబడులు గణనీయంగా తగ్గడం వంటి కారణాలు చోటుచేసుకున్నాయి.

ముందుగానే పరిస్థితిని అంచనా వేసుకున్న దళారులు ఇతరప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఉల్లినిల్వలు చేసుకున్నారు. ఆ మాత్రం ముందుచూపు పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఫలితంగా విని యోగదారుడు ఉల్లికోసం తల్లడిల్లిపోయాడు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com