కర్నూలు జిల్లాలో ఘనంగా గాడిదలకు పెళ్లి..ఎందుకో తెలుసా..?

టెక్నాలజీ రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నప్పటికీ..ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతుంటారు. ముఖ్యంగా వానల కోసం చాలా ప్రాంతాల్లో ప్రజలు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. కప్పదాట్లు, జంతువులకు పెళ్లి చేయడం వంటి పూజలు నిర్వహిస్తుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం వెలుగు చూసింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అక్కడి ప్రజలు గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పత్తికొండ మండలం.. హోసూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

సకాలంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామస్థులు వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇందులో బాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. అనంతరం ఊరేగింపు నిర్వహించారు. హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే గాడిదలకు పెళ్లి చేసారు.