లేఖ లేకుండానే దిగిపోనున్న ట్రంప్‌!

బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌క ముందే శ్వేత‌సౌధాన్ని వీడ‌నున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: డొనాల్ట్‌ ట్రంప్‌ రేపటితో అమెరికా అధ్యక్ష పదవికి వీడ్కోలు పలకబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ 1989 నుంచి వస్తున్న వీడ్కోలు లేఖ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఎలాంటి లేఖ రాయకుండానే ట్రంప్ పదవి నుంచి దిగిపోనున్నారు. కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు లేఖ రాసే సంప్రదాయానికి రొనాల్డ్ రీగన్ శ్రీకారం చుట్టారు. 2017లో పదవి నుంచి దిగిపోవడానికి ముందు ఒబామా ట్రంప్‌నకు లేఖ రాశారు.

కానీ ఇప్పుడు జో బైడెన్ ఎన్నికనే గుర్తించని ట్రంప్ లేఖ రాసే అవకాశాలు కనిపించడం లేదు. విజయానికి కచ్చితమైన నమూనా ఏమీ ఉండదని, ఇక్కడందరూ తాత్కాలికంగా ఉండేవారేనని అప్పట్లో ట్రంప్‌కు రాసిన వీడ్కోలు లేఖలో ఒబామా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు, సంప్రదాయాలకు రక్షకులుగా ఉండాలని ఒబామా తన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ట్రంప్ మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టనున్నట్టు వార్తలు రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


కాగా, అధ్య‌క్షుడిగా బుధ‌వారం జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌క ముందే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు తీసుకోనున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు వాషింగ్ట‌న్ న‌గ‌ర శివారుల్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వ‌ద్ద ట్రంప్ వీడ్కోలు కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. అక్క‌డ నుంచి ‌ఫోర్స్ వ‌న్ విమానంలో డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాకు బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. బుధ‌వారం 7.15 గంట‌ల‌క‌ల్లా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానితుల‌కు పంపిన ఇన్విటేష‌న్‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం.,

తొలి నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌.. త‌న ఓట‌మిని అంగీక‌రించ‌డానికి సిద్ధంగా లేరు. ఈ నేప‌థ్యంలోనే శ్వేత‌సౌధానికి వ‌చ్చే జో బైడెన్‌కు ఎదురుప‌డేందుకు ట్రంప్ అనుకూలంగా లేరు. బైడెన్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కాబోన‌ని ముందే ట్రంప్ ప్ర‌క‌టించారు. గ‌త శ‌తాబ్ద కాలంలో అధికార మార్పిడికి దూరంగా ఉంటున్న డొనాల్డ్ ట్రంప్ మొద‌టి వారు కానున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/