డాలర్ శేషాద్రి అంత్యక్రియలు పూర్తి

గుండెపోటుతో కన్నుమూసిన తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తిరుపతి లోని సత్యహరిశ్చంద్ర వైకుంఠధామంలో ఈయన అంతిమ సంస్కారాలు పూర్తి చేసారు. అంతకు ముందు శేషాద్రి నివాసం నుంచి అంతియ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడం తో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. టీటీడీలో డాలర్ శేషాద్రికి ఎంతో పేరు ఉంది. సాధారణ గుమాస్తాగా చేరి దేవస్థానం ఓఎస్డీ స్థాయికి ఎదిగారు. 50 ఏళ్ల నుంచి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, ఉత్సవాలు, కైంకర్యాలు, సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై శేషాద్రికి పట్టు ఉంది. అందుకే రిటైర్మెంట్ అయి పదేళ్లకు పైనే అయినప్పటికీ ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు.