కుక్క ఆచూకీ చెపితే రూ. 10 వేలు ఇస్తారట

కుక్క ఆచూకీ చెపితే రూ. 10 వేలు ఇస్తారట

మాములుగా మనిషి ఆచూకీ తెలిపితే డబ్బులు ఇస్తామనే ప్రకటనలు ఎక్కువగా చూస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఓ యజమాని తన కుక్క ఆచూకీ తెలిపితే రూ. 10 వేలు ఇస్తామని ప్రకటన చేసారు. ఇది హైదరాబాద్ లోని మూసాపేట్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని నిజాంపేటలో కృష్ణ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. వీరికి పొమెరేనియన్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఉంది. దీని పేరు విక్కీ. వయసు రెండున్నర సంవత్సరాలు. ఈనెల 20న కృష్ణ కుటుంబం ముఖ్యమైన పని మీద విజయవాడ బయలుదేరారు. వారితో పాటు విక్కీని తీసుకెళ్లలేక మూసాపేట కియా షోరూంకు ఎదురుగా ఉన్న పెట్ బోర్డు సెంటర్‌లో ఉంచారు. కానీ, విక్కీని పెట్ బోర్డు సెంటర్‌లో వదిలినప్పటి నుంచీ అది చాలా బెంగగా కనిపించిందట. అస్సలు ఏమీ తినలేదట. ఈ క్రమంలో పెట్ బోర్డు సెంటర్ నుంచి విక్కీ తప్పించుకుని పారిపోయింది.

ఈ విషయాన్ని పెట్ బోర్డు సెంటర్ వాళ్లు కృష్ణకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కృష్ణ కుటుంబం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి విక్కీ కోసం కృష్ణ వెతుకుతూనే ఉన్నారు. కానీ దాని జాడ ఎక్కడ కనిపించడం లేదు. కృష్ణ తండ్రికి విక్కీ అంటే ప్రాణమట. అది కనిపించకపోవడంతో ఆయన మూడు రోజుల నుంచి తిండి తినట్లేదని కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధను తాము ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. విక్కీ తమ ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే దాని ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయల నజరానా ప్రకటించామని.. ఆచూకీ తెలిపితే కచ్చితంగా ఆ డబ్బు ఇస్తామని చెప్పుకొచ్చారు. మరి విక్కీ ఎక్కడ ఉందో..