గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ఆత్మహత్యాయత్నం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు

doctor-vasant
doctor-vasant

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ అనుమానాలతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది వైద్య పరీక్షలు చేయించకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఈ పరీక్షల్లో అన్ని కేసులు నెగెటివ్ అనే తేలినా… పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయంటూ లీకులు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యునిగా భావిస్తూ డాక్టర్ వసంత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో వసంత్ కుమార్ హల్ చల్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ పెట్రోల్ డబ్బా పట్టుకొచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే వసంత్ మాత్రం ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో వసతులు లేమిపై తాను ప్రశ్నించడం వల్లే తనపై వేటు వేశారని ఆయన అన్నారు. తాను మంత్రిని కలిశానని ఆయన నుంచి ఎలాంటి హామీ లభించిందని అన్నారు. చేయని నేరానికి తాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేనని వసంత్ అన్నారు. దీనిపై సూపరిండెంట్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఎవరినీ దగ్గరకు రానీయకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/