ఆసుపత్రి నుండి డాక్టర్‌ సుధాకర్‌ డిశ్చార్జ్‌

ఆసుపత్రి నుండి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు

doctor-sudhakar

అమరావతి: విశాఖలో ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌ను హైకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. తనను డిశ్చార్జ్ చేయాలంటూ కోర్టు ఆదేశించిన తర్వాత డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించిన తన కుమారుడిని హైకోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆయనను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ పోలీసు కస్టడీలో లేరని, మెరుగైన వైద్యం కోసం విశాఖ మానసిక వైద్యశాలకు తరలించినట్టు తెలిపారు. ఆయన డిశ్చార్జ్ కావాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు, సీబీఐ కూడా సుధాకర్ తమ కస్టడీలో లేరని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, సీబీఐ దర్యాప్తునకు మాత్రం సహకరించాలని కోరింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/