డేటింగ్ యాప్ పిచ్చిలో పడి రూ. కోటిన్నర పోగొట్టుకున్న డాక్టర్

డేటింగ్ యాప్ పిచ్చిలో పడి ఓ డాక్టర్ ఏకంగా రూ. కోటిన్నర పోగొట్టుకున్న ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. గతంలో లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని , పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అలాంటి యాప్ ల జోలికి పోకూడదని హెచ్చరించారు. అయినప్పటికీ డాక్టర్ తీరు మారలేదు. అలాగే యాప్ లో అమ్మాయిల కోసం వెతికి చివరకు కోటిన్నర పోగొట్టుకొని ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్తే.. సదరు డాక్టర్ 2020 లో జిగోలో డేటింగ్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్‌లో డేటింగ్ చేసే యువతుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా ఓ యువతి యాక్సెప్ట్ చేసింది. ఆమె అమ్మాయని నమ్మి.. ఆమె అడిగిందల్లా చేసుకుంటూ వెళ్తూ వచ్చాడు. తన ఫొటోస్ , వీడియోస్ ఇలా అన్ని పంపించాడు. అంతే కాకుండా అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు. మరోవైపు అమ్మాయి ముసుగులో చాట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. డాక్టర్ నుంచి విడతల వారీగా కోటిన్నర రూపాయలు కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతణ్ని చూసి షాక్ తిన్నారు. గతంలో ఇలాంటి కేసులోనే మోసపోయి తమ వద్దకు వస్తే కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు.

గతంలో “జిగోలో డేటింగ్ యాప్‌ ద్వారా రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. మేం డేటింగ్ వెబ్‌సైట్లు, యాప్‌ల మోసాలపై అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాం. కౌన్సెలింగ్ తర్వాత కూడా అతను జిగోల్ డేటింగ్ యాప్ ద్వారా పలు ఖాతాలకు రూ.80 లక్షలు బదిలీ చేశాడు. కేసు దర్యాప్తులో ఉండగానే మరో రూ.30 లక్షలు బదిలీ చేశాడు. కోటీ పది లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత మళ్లీ మాకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు మొత్తం కోటిన్నర కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది.” అని సైబర్ పోలీసులు తెలిపారు.