మోడీపై మరోసారి మల్లికార్జున్ ఖర్గే విమర్శలు
రావణుడిలా మోడీకి పది తలలున్నాయా..?… ఖర్గే

అహ్మదాబాద్ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెహ్రంపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మరోసారి ప్రధాని మోడీపై మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలైనా, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మోడీ ముఖం కనిపిస్తోందన్న ఖర్గే.. మోడీజీ మీకు రావణుడిలా పది తలలున్నాయా అని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అసలు ఎన్నికలేవైనా మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని, అభ్యర్ధి పేరుతో ఓట్లు అడగండని హితవు పలికారు. మోదీ వచ్చి మున్సిపాలిటీలో పనులు చేసి పెడతారాన అని ఖర్గే నిలదీశారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, అవసరం వచ్చినా మోదీ సాయం చేస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని మోడీపై గుజరాత్ ఎన్నికల ప్రకచారంలో ఖర్గే పదునైన వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నారు.
ప్రధాని ఓటర్ల సానుభూతి పొందేందుకు తాను పేదవాడినని పదేపదే చెబుతున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారని ఇటీవల ఓ ర్యాలీలో ఖర్గే విమర్శించారు. ఇక ప్రధాని మోడీని ఖర్గే రావణుడితో పోల్చడం పట్ల కమలనాధులు మండిపడుతున్నారు. గుజరాత్‌లో ప్రజా సమస్యల మీద పోరాడటం చేతకాని కాంగ్రెస్ సహనం కోల్పోయి ప్రధానిపై చవకబారు విమర్శలు చేస్తోందని బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/