భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై ఆందోళన వద్దు

ICC
ICC


కరాచి: ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ భద్రతకు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదని ఐసిసి సిఈఓ దేవ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై స్పందించారు. ప్రపంచకప్‌లో పాల్గొనే అన్నిదేశాలూ ఐసిసి నిబంధనలకు కట్టుబడి ఉంటాయనే సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. అలాగు జూన్‌ 16న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నిర్వహణ, భద్రతా అంశాల్లో తనకెలాంటి అనుమానాలు లేవన్నారు. ఏదైనా కారణం చేత ఏదైనా జట్టు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడకపోతే ఆ పాయింట్లు ఇతర జట్టుకి కలిసివస్తాయని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మృతిచెందిన నేపథ్యంలో రాబోయే ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా మ్యాచ్‌ను నిషేధించాలని వస్తున్న డిమాండ్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు.
పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాద సంబంధం కలిగిన దేశాలను ఐసిసి నుంచి బహిష్కరించాలని కోరుతూ బిసిసిఐ పాలక కమిటి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే పాక్‌ బోర్డు సైతం..భారత్‌-ఆసీస్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాపులను ధరించి ఆడటంపై అభ్యంతరం తెలుపుతూ ఐసిసికి ఫిర్యాదు చేసింది. ఈ విషయాలపై స్పందించిన దేవ్‌ రిచర్డ్‌సన్‌ పుల్వామా ఆర్మీ క్యాపులు ధరించేందుకు అనుమతి పొందారని చెప్పారు. క్రికెట్‌కు రాజకీయాలు ఆపాదించడం ఐసిసి ఉద్ధేశం కాదని ఆయన తేల్చిచెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/