ఉపాధిని ఉరితాడుగా మార్చొద్దు

Farmers

విశ్వాసం వ్యక్తికి అద్భుతమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. కార్యోన్ముఖున్ని చేస్తుంది. ఎన్ని అపజయాలు ఎదురైనా, మరెన్ని ఎదురు దెబ్బలు తగిలినా విశ్వాసం ఉన్న వ్యక్తి తొణుకడు, బెదరడు. ముందుకు సాగిపోతూనే ఉంటాడు. అదే వ్యక్తికి విశ్వాసం సన్నగిల్లితే ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా తట్టుకోలేడు. తనకు తానుగా సమిధైపోతాడు. అందుకే విశ్వాసం అనేది మానవ జీవన పోరాటంలో అత్యంత ప్రధానమైంది.ఆ విశ్వాసం దెబ్బతినే భారత దేశంలో అన్నం పెట్టే రైతన్నలే ఆత్మగౌరవం చంపుకోలేక, తమను ఆదుకునేవారు మరెవరూ లేరనే నిరాశా నిస్పృ హలతో తమలోతాము కృంగికృశించి మరో గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఒకరు కాదు,ఇద్దరు కాదు ఏటా వేల సంఖ్యలో ఆత్మాహుతైపోతున్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని పదేపదే చెప్తున్నా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, హామీల వర్షం కురిపిస్తున్నా వారి అభ్యున్నతికి శాయశక్తుల కృషి చేస్తున్నామని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నా రైతులు అంతగా విశ్వసించడం లేదు. తాజాగా 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11వేల379 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మ హత్యకు పాల్పడినట్లు జాతీయ నేరగణాంక సంస్థ వెల్ల డించిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చిన లెక్కలే. మరెందరో రైతులు బాధలు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నా వీటికి ఇతర కారణాలు కూడా తోడుకావడంతో ఈ లెక్కల్లోకి అవి రావడం లేదు. సగటున ప్రతిరోజూ 31 మంది, నెలకు 948 మంది రైతులు బలవన్మరణాలకు గురవ్ఞతున్నారని నివేదిక వెల్లడించింది. అన్నింటికంటే ముఖ్యంగా రైతుల బలవన్మరణాల జాబితాలో అగ్రస్థానంలోఉన్న మహారాష్ట్ర 2016లోనూ3,661మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప డ్డారు.

రెండోస్థానంలో ఉన్న కర్ణాటక 2078 మంది, మధ్యప్రదేశ్‌లో 1321,ఆంధ్రప్రదేశ్‌లో 804, ఛత్తీస్‌గఢ్‌లో 682, తెలంగాణాలో 645 బలవన్మరణాలు సంభవించి నట్లు ఎన్‌సీఆర్‌బీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్‌సీఆర్‌బీ ఈ రైతుల ఆత్మహత్యల వివ రాలు సేకరించ ప్రారంభించిన 1995 నుంచి 2016 వరకు మూడులక్షల ముప్ఫైఆరువేల నాలుగువందల ఏడు మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

అటు కూలీ లుకానీ, ఇటు రైతులు కానీ అంతెందుకు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాలు కూడా ఈ ఆత్మహత్యల బాటవైపే మొగ్గుచూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలు కూడా అన్నదాతల ఆత్మహత్యల్లో 2016లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగోస్థానంలో ఉంటే తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ముఖ్యంగా పంటనష్టాలు, ఏటేటా పెరి గిపోతున్నా పెట్టుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు చేయడం, తీర్చలేక తనువ్ఞ చాలిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్‌ లాంటి కార్యక్రమాలతోపాటు కోట్లాది రూపాయల సబ్సిడీతో వ్యవసాయపరికరాలు కూడా అందిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణాలో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే రైతుల సంక్షేమ ప్రభుత్వంగా అందరి మన్ననలను అందుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. రుణ మాఫీ పథకం కొనసాగుతూనే ఉన్నది.రైతులకు ఇవికొంత ఊరట కలిగించే మాట వాస్తవమే అయినా ఆత్మహత్యల ను ఇవేమీ ఆపలేకపోతున్నాయి.అంతకుముందు కూడా రైతులకు సంబంధించి ఎరువ్ఞలు,క్రిమిసంహారకమందులు, వ్యవసాయపరికరాలు, తదితర ముడిపదార్థాలను సబ్సిడీ రేట్లకు అందించే కార్యక్రమాలు ఎన్నో జరుతూనే వచ్చా యి. స్ప్రింకర్లు, డిప్‌ ఇరిగేషన్‌వంటి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం సాగించేందుకు ప్రోత్సాహకాల కింద దేశ వ్యాప్తంగా లక్షలాది కోట్లు సబ్సిడీ రూపంలో అందిస్తూనే ఉన్నారు.

అయినా రైతుల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరు గుపడకపోగా రోజురోజుకు మరింత దిగజారుతూనే ఉన్న ది. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదనేది కాదనలేని వాస్తవం.ఈ మాఫీ పథకాలు,సబ్సిడీలతో రైతు ల ఆత్మహత్యలు ఆగిపోతాయనుకోవడం సమంజసం కాదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది.

ప్రకటించిన పథకాల్లో కూడా లోటుపాట్లను మరింత పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.మరో ముఖ్యవిషయం నెలనెలా వేలాది రూపాయలు వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం ఉద్యోగులు,చిన్నాపెద్ద పారిశ్రామికవేత్తలు,ఎందరో వ్యాపారస్తులు భూములు కొనుక్కొని రైతులుగా గుర్తింపు పొందుతున్నారు.కొందరు అయితే ఆదాయపుపన్ను నుంచి రక్షణ పొందేందుకు రైతులైపోతున్నారు. వచ్చిన సమస్య అంతా కేవలం వ్యవసాయమే జీవనాధారంగా మరో వ్యాపకం రాక,లేక,గ్రామాల్లోనే ఉంటూ జీవనంసాగిస్తున్న రైతులదే సమస్య.

అలాంటి రైతులకే ఈ పథకాలు వర్తింప చేయగలిగితే మరింత ఉపయోగం ఉంటుంది. కేవలం మూడువేల రూపాయల అప్పు చెల్లించలేక ఆత్మ హత్యలకు పాల్పడిన రైతుకుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గత రెండు మూడుదశాబ్దాలుగా చితికిపోయి పతనావస్థకు చేరుకున్న వ్యవసాయరంగాన్ని మళ్లీ పున రుజ్జీవింపచేసి రైతులలో కొత్త ఆశలను చిగురింపచేసే కోణంలో, చేతల ద్వారా త్రికరణశుద్ధిగా ప్రయత్నం జరగాలి.

ఎంత అభివృద్ధిచేసినా మనిషి జీవనానికి ఆహారం తప్పనిసరి. ఇంతపెద్ద జనాభాకు కావలసిన పంటలు రైతుల ‘చెమట పుణ్యమేనని గుర్తుంచుకోవాలి. వారికి ఉన్నఒకే ఒక ఉపాధిని వారి పాలిట మృత్యువ్ఞగా పరిణ మించకుండా చూడాల్సిన గురుతర బాధ్యత పాలకులందరిపై ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/