ధర్మాన్ని త్యజించరాదు

కళ్ళజోళ్లు మరిచిపోయేవారు, చేతిగుడ్డలు పడేసుకొనే వారైతే లెక్కకు అందని సంఖ్యలో ఉంటారు.

OM

కాని, మనకే నచ్చని ఈ విషయం నుండి విడిపడటానికి చాలాకాలం పడుతుంది. సామాన్య విషయాలే ఇలా ఉన్నాయి. ఒక్క క్షణాన ఎవరో వచ్చి ‘తత్వమసి నీవే బ్రహ్మము అనగానే జీవత్వము జారిపోతుందా? ఆంతర్యం నుండి పారిపోతుందా? ఇదేమన్నా గారడివిద్యనా? చాలాకాలం ఒక గాడిలో పడి ప్రయాణం చేస్తేగాని భ్రమ తొలగదు. ప్రేమ కలగదు. బహుకాల సంస్కారాలు, బహుకాల సాధనల వల్లనే పోతాయి. నీవ్ఞ బ్రహ్మమే. ప్రతిబంధకాలు ఎవరివి? నీవ్ఞ సృష్టించుకున్నవే. వాటిని అలాగే ఉంచుకొని, బ్రహ్మంగా ఊరేగాలంటే సాధ్యమా? ఆలోచన ఒక్కటే సరి పోదు. ఆచరణ కూడా ఉండాలి. బహిరంగ సాధనతో పాటు అంతరంగ సాధన కూడా సాగుతూ ఉండాలి. ‘

నాకు అంతా తెలుస్తూనే ఉంది. శాస్త్రం అర్థం అవ్ఞతూనే ఉంది. కాని మనస్సు భగవంతుని మీద క్షణం నిలవటం లేదు. ప్రతిక్షణం పరుగులే ఇవీ ఫిర్యాదులు. మనస్సు పరుగులెత్తుతూ ఉంది అనేది వాస్తవమే. కాని, మనస్సు భగవంతునికి దూరంగా పరుగులెత్తుతూ ఉంది అనేది సత్యం కాదు. ఎంత దూరం పరుగులెత్తినా మనస్సు చైతన్యానికి దూరంగా పరుగులెత్తలేదు. చైతన్యం ఎవరో కాదు. భగవంతుడే. అనంతుడైన భగవంతునికి మనస్సు దూరంగా వెళ్లలేదు అనే సత్యం వంటపడితేనే శాస్త్ర అర్థమయిందని నిశ్చయం.

ఇంత సుస్పష్టంగా, స్వచ్ఛంగా కనిపిస్తున్న సత్యం నిజజీవితంలోకి, నిత్య జీవితంలోకి రావటం ఎంత దుర్లభంగా ఉందో చూశారా? పామరులు సరే, శాస్త్రాధ్యయనం చేసిన పండితులూ అలాగే అంటున్నారు. సాధకులు అలాగే మాట్లాడుతున్నారు. సన్యాసులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. రోజూ అలవాటుగా మరచిపోయే విషయాల్లాగా, పరమాత్మను స్మరిస్తూనే ఉన్నాం. విస్మరిస్తూనే ఉన్నాం.

అనాదిగా అంటిపెట్టుకొని వస్తున్న అనాచారాలు క్షణాల్లో పండుటాకులు రాలినట్లు రాలవు దూదిముక్కల్లా దురదృష్టాలు గాలిలోకి ఎగిరిపోవు. క్షణక్షణాన్ని వినియోగించుకోవాలి. ప్రతిక్షణాన్ని పవిత్రంగా కాపాడు కోవాలి. బాహ్యంలో ఏది జరుగుతున్నా ఆంతర్యంలో స్మరణ సాగుతూ ఉండాలి. ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టాలి.

ధర్మాధర్మాలను అర్థం చేసుకొంటూ నడక సాగించాలి. నీకు ఇష్టమైనదని అధర్మాన్ని చేయకూడదు. నీకు అయిష్టమని ధర్మాన్ని త్యజించకూడదు. యుద్ధం భయంకరమే. అయినా అందులో ధర్మం ప్రవేశించి ఉంది. అందుకనే ‘అర్జునా! యుద్ధానికి సిద్ధపడు అన్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధం కురుక్షేత్రానికే పరిమితం కాదు. అర్జునుడికే సంబంధించి కాదు. జీవికి జీవన సమరం తప్పదు. అనివార్యాలను తొలగించలేము. అవగాహనను చిగురింపచేసుకోవాలి. సమరం బాహ్యంలో సాగుతూనే ఉండాలి. సాధన ఆంతర్యంలో కొనసాగుతూనే ఉండాలి.

తస్మాత్‌ సర్వేషు కాలేషు మా మమస్మర యుధ్యచ’సదా నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి అని అద్భుతమైన పవిత్ర సాధనను గీతలో తెలిపాడు పరమాత్మ. ఆత్మబంధువ్ఞలారా! ఆలకించింది చాలు అని నేను అనను. ఆలపించేవాళ్ళం బ్రతికే ఉన్నాం. ఆలకించకుండా మీరు ఎలా ఉంటారు? ఆలకిస్తూ ఆచరిద్దాం. ఆచరిస్తూ ఆలకిద్దాం. ఇదే మన తక్షణ కర్తవ్యం.

సాధనలన్నీ పవిత్రములే. అవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. ఒంటరిగా ఉంటే, లేదా సమయం దొరికితే ధ్యానం చేద్దాం. కీర్తన సాగిద్దాం. లేదా పరమాత్మను గురించి ఆలోచిద్దాం. ఇతరులను కలిస్తే భగవద్విషయాలను ముచ్చటించుకుందాం. భగవత్సేవలో నిమగ్నమవ్ఞదాం. సాధనలు బరువ్ఞల్ని దించుతాయి. సాధనను ఒక బరువ్ఞగా, బాధగా సాగించకండి.

సాధన ప్రేమకార్యం. ప్రేమైవ కార్యం. సాధనలో ప్రయత్నముంది అని భావించినంత వరకు సాధన జరగదు. సాధనలో ప్రేమ ఉంది, స్వాత్మానుభూతి ఉంది అనే సత్యం అర్థమైతే, అనుక్షణం సాధనే శ్వాసగా మారుతుంది. ఆశగా మారుతుంది. అద్దం చూసుకోవాలంటే అందరికీ హాయిగానే ఉంటుంది. అది పని అనిపిస్తూ ఉందా? భారంగా ఉందా? ఆనందంగా ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/