సీనియర్లు, జూనియర్ల మేళవింపుగా జాబితా

ఏడుగురు తెలుగువారికి టికెట్లు ఇచ్చిన డీఎంకే


చెన్నై: త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు తెలుగువారు బరిలోకి దిగనున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే నిన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మాజీ మంత్రులు, తన తండ్రి హయాం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారితోపాటు యువతకు కూడా చోటిస్తూ ఆ పార్టీ అధినేత స్టాలిన్ జాబితా రూపొందించారు. 78 మంది సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇచ్చిన స్థాలిన్.. ఏడుగురు తెలుగువారికి కూడా టికెట్లు ఇచ్చారు.

మొత్తం అభ్యర్థులలో 9 మంది వైద్యులు, 28 మంది న్యాయవాదులు, 13 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 173 స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే 131 స్థానాల్లో అధికార అన్నాడీఎంకే అభ్యర్థులతో నేరుగా పోటీ పడనుంది. చెన్నైలోని కొళత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చేపాక్-ట్రిప్లికేన్ నుంచి ఆయన తనయుడు ఉదయనిధి బరిలోకి దిగుతున్నారు.

డీఎంకే సీటిచ్చిన తెలుగువారిలో, చెన్నై హార్బర్ నుంచి పీకే శేఖర్‌బాబు, సైదాపేట నుంచి ఎం.సుబ్రహ్మణ్యం, అన్నానగర్‌ నుంచి ఎంకే మోహన్‌, తిరుచ్చి వెస్ట్ నుంచి కేఎన్‌ నెహ్రూ, తిరువణ్ణామలై నుంచి ఏవీ వేలు, కృష్ణగిరి జిల్లా హోసూరు నుంచి వై. ప్రకాష్‌, విల్లుపురం జిల్లా తిరుక్కోవిలూర్‌ నుంచి కె.పొన్ముడి బరిలోకి దిగుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/