గవర్నర్‌ను తొలగించండి…రాష్ట్రపతికి డీఎంకే లేఖ

చెన్నైః తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. గవర్నర్ ప్రశాంతతకు ముప్పు అని డీఎంకే ఆరోపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు సేవలందించకుండా ఆయన అడ్డుకుంటున్నారని మండిపడింది. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ వినతిపత్రాన్ని పంపించింది.

ఆర్ఎన్ రవి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటపుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేశారని, ఆ ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘిస్తున్నారని ద్రౌపది ముర్ముకు సమర్పించిన వినతిపత్రంలో డీఎంకే ఆరోపించింది. ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని తెలిపింది.

ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిలించే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలను రాజద్రోహంగా కొందరు పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. రాజ్యాంగ పదవికి ఆయన అనర్హుడని పేర్కొంది. ఆయన ఉద్వాసనకు తగినవారని తెలిపింది. ఈ మెమెరాండంపై డీఎంకే అధిష్ఠాన వర్గం నేతలు, ఆ పార్టీ మిత్ర పక్షాల నేతలు సంతకాలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ మెమొరాండంను ఈ నెల 2న రాసినట్లు సమాచారం.

డీఎంకే ఇటీవల భావసారూప్యతగల ఎంపీలకు ఓ లేఖ రాసింది. రవిని గవర్నర్ పదవి నుంచి తొలగించాలనే తమ ప్రతిపాదనకు మద్దతివ్వాలని కోరింది. ఇదిలావుండగా, గవర్నర్ రవి ఈ పరిణామాలపై స్పందించలేదు. తమిళనాడులో 20 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపవలసి ఉంది.

కాగా, కేరళ, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య కూడా జగడాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః