కవిత విషయంలో బండి సంజయ్ ని సపోర్ట్ చేసిన డీకే అరుణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలఫై యావత్ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీచర్ల సమావేశంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ ఫై పిర్యాదు లు చేస్తున్నారు. అలాగే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. దీంతో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా బండి సంజయ్ కమిషన్ ముందు హాజరు కావాలని కోరింది.

ఇదిలా ఉంటె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాత్రం బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధించారు. బండి సంజయ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని , తెలంగాణలో వాడుకలో ఉన్న నానుడిని బండి సంజయ్ ప్రస్తావించారని అన్నారు. చిన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ తమిళిసైని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తిట్టినప్పుడు వీరంతా ఏంచేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కుమార్తె తప్ప మిగతావాళ్లు ఆడబిడ్డలు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.