బిజెపిలో చేరిన డీకే అరుణ

amit shah, dk aruna
amit shah, dk aruna

హైదరాబాద్‌: ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తొలుత ఆమెతో హైదరాబాద్‌లో సమావేశం అయినట్లు సమాచారం. చర్చల నేపథ్యంలోనే బిజపి అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా అరుణ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా భాజపా నేతలు అరుణతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం నాటికి ఇవి కొలిక్కివచ్చాయి. రాష్ట్రాల వారీగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి డీకే అరుణ బిజెపిలో చేరుతున్నట్లు అమిత్‌షా నేతలకు చెప్పారు. ఈక్రమంలో అమిత్‌షా, కేంద్రమంత్రి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, మురళీధర్‌రావుల సమక్షంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు డీకే అరుణ బిజెపిలో చేరారు. అయితే వాస్తవానికి బిజెపి తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రమే వెలువడాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇది వాయిదా పడింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/