అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన డీకే అరుణ

DK Aruna
DK Aruna

ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేసారు. ఇంట్లో అరవింద్ లేని సమయంలో కార్య కర్తలు పెద్ద ఎత్తున అరవింద్ ఇంటికి చేరుకొని , ఫర్నిచర్ ధ్వసం చేసారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వసం చేసారు. ఈ దాడి పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు.

బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నాకు సిద్ధమైతేనే అరెస్ట్ చేసి కేసులు నమోదుచేసే పోలీసులు మరి ఇప్పుడేం కేసులు బుక్ చేస్తారో చెప్పాలని అన్నారు. ఈ దాడికి ప్రధాన కారకురాలైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదుచేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం దీనికి సంకేతమని అన్నారు.

మరోవైపు అర్వింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో కొట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా తనపై వ్యాఖ్యలు చేశారని.. మొన్నటి వరకు ఒపిక పట్టామని.. ఇకపై చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తాను బాధతో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని.. అర్వింద్ రాజకీయాలు చేయాలి కాని.. పిచ్చి వేషాలు వేయకూడదన్నారు. ఆయన కాంగ్రెస్‌తో కలిసి గెలిచారన్నారు. ఆయన ఎక్కడ పోటీ చేసిన వెంబడించి మరీ ఓడిస్తామన్నారు.