రాత్రి 10 తర్వాత డీజెపై తెలంగాణలో నిషేధం!

ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతి

DJ
DJ

హైదరాబాద్‌: డీజె(డిస్క్‌ జాకీ) సౌండ్‌తో నిర్వహించే మ్యూజిక్‌ తెలంగాణలో పూర్తిగా నిషేధం. రాత్రి పది గంటల తర్వాత డిజెను పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉండాల్సిన శబ్ద పరిమితికి విరుద్ధంగా డిజె మ్యూజిక్‌ శబ్ద కాలుష్యాన్ని సృష్టింస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శబ్దం పట్టణ ప్రాంతాల్లో ఐతే 55, గ్రామాల్లో ఐతే 45 డెసిబుల్స్‌ స్థాయిని మించకూడదని స్పష్టంగా సూచించారు. ఇక రాత్రి 10 గంటల తర్వాత ఆ శబ్దం కూడా ఉండవద్దని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో డిజె సౌండ్‌తో మ్యూజిక్‌ను నిషేధించారు. డిజె సౌండ్‌ మ్యూజిక్‌ కనీసం శబ్దం 100 డెసిబుల్స్‌కు మించి ఉంటుంది. ఇలా సౌండ్‌ను పెంచుకుంటూ పోతే ఒక్కోసారి 300 డెసిబుల్స్‌ కూడా దాటుతుంది. ఈ శబ్దం అనారోగ్యంతో ఉన్న వారికి ప్రాణ సంకటంగా మారుతుంది. సాధారణ ప్రజలకు కూడా ఈ శబ్దం ఉన్న ప్రాంతంలో నిలబడితే గుండె దడతో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొట్టుకుని కలవరాన్ని రేపుతుంది.
డిజెలపై నిషేధం ఉన్న నేపథ్యంలో వాటిని ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తే చట్టవిరుద్ధమే. డిజెల గురించి సమాచారం వస్తే వాటిని సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకులపై సిటీ పోలీస్‌ యాక్టుతో పాటు ఐపిసి 188 కింద కేసులను నమోదు చేస్తున్నామని, సామాన్య ప్రజలు కూడా డిజెలకు సంబంధించి సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని అడిషనల్‌ పోలీస్‌ కమీషనర్‌, సుధీర్‌బాబు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/