జగతిని జాగృతం చేసే పండుగ

నేడు దీపావళి సందర్భంగా…

Diiwali festival celebration
Diiwali festival celebration

భారతదేశ సంస్కృతికి, జాతికి మూలమైన ఆదర్శాలను, విలువలను సజీవంగా ఉంచేందుకు మన పండుగలు దోహదం చేస్తాయి.

కాశ్మీర్‌ నుంచి కన్యకుమారి వరకు జాతి, కుల, మత, ప్రాంతీయ భాషా భేదాలు లేక అందరూ జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ.

జీవితాన్ని కాంతిమంతం చేసే వెలుగుదారులకు దీపావళి చిహ్నం. జగత్తు అంతా దీపాల తోరణాలతో వెలుగొందే పండుగే దీపావళి.

మానవుల్లోని మాలిన్యసహితమైన అజ్ఞానాన్ని తొలగించి జ్యోతి స్వరూపమైన విజ్ఞాన జ్యోతిని వెలిగించడమే ‘దీపావళిలోని ఆంతర్యం. దీపావళి అంటే దీప+ఆవళి=దీపాల వరుస లేక దీపాల సమూహం అని అర్థం.

దీపం అంటే జ్ఞ్ఞానం. వెలుగు, మంచి నడవడిక అనే అర్థాలున్నాయని తత్త్వవేత్తల అభిభాషణ.
మానవుల జీవితాల్లో వెలుగును నింపిన ఈ రోజున దీపాలంకరణ ద్వారా మానవులు తమలోని వెలుగును బయటికి ప్రసరింపచేస్తున్నారు.

ఆశ్వ యుజంలో వచ్చే దీపావళి పండుగలో అనేక కర్తవ్యాలు కనిపిస్తాయి. అయితే వీటన్నింటిలోను అంతస్సూత్రం మాత్రం ఒక్కటే.

అదే మానవ త్త్వపు వెలుగులను నలుదిశలా వ్యాపింపజేయడమే. అంటే జ్ఞానకాంతులు వెదజల్లే వెలుగుల పండుగే దీపావళి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించి ఆచరింపచేసేదే దీపావళి.

చారిత్రక దీపావళి..

ఈ దీపావళిని ‘దివ్వెల పండుగని, ‘దివిలీ పండుగని, ‘దివిటీల పండగనీ అంటారు.శ్రీహర్ష చక్రవర్తి తన నాగానంద కావ్యంలో ‘దీప ప్రతి పదోత్సవం అని అన్నాడు. కొత్తగా పెళ్లి అని దంపతులకు కానుకలిస్తారని చెప్పాడు.

రాజశేఖరుడు దీనిని ‘దీపమాలికగా వ్యవహరిం చాడు. మరికొన్ని మత గ్రంథాలు దీనిని ‘సుఖరాత్రి వ్రతం చేసుకునే శుభదినంగా పేర్కొన్నాయి.

Diiwali festival celebration
Diiwali festival celebration

అంతేకాక వాత్సాయన కామసూత్రాల్లో ‘కౌముదీ మహోత్స వంగాను, ‘దీపాన్వికగా స్కాంద, నారద, భవి ష్యత్‌ పురాణాల్లోను, ‘దీపదాన మహోత్సవంగా వామన పురాణాల్లోను అభివర్ణించబడింది. బౌద్ధసాహిత్యం ‘య-రాత్రిగా విశదీకరించబడింది.

దీన్ని మన భారతీయ సంస్కృతిలో దీపం ‘పరబ్రహ్మ స్వరూపంగా అభివర్ణించారు.

విక్రమాదిత్యుడు పట్టాభిషేకం చేసుకున్న రోజుని ‘దీపావళి అన్నారు. శ్రీరాముడు రావణుని సంహరించి, సీతా లక్ష్మణులతో అయోధ్యలో ప్రవేశించిన రోజని భావిస్తారు.

ఆ రోజు దీపాలతో స్వాగతం పలికారు అయోధ్యావాసులు. జైనతీర్థంకరుడైన మహావీరుడు నిర్యాణం పొందింది దీపావళినాడే అని చెబుతారు. మరొక గొప్ప విశేషం ఉంది.

Diwali lights

ఈ దీపావళినాడే మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి అమరజీవి పొట్టి శ్రీరాముని త్యాగ ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.ఆంధ్రజాతి యావత్తూ దీపమాలికలతో ‘తెలుగు తల్లికి స్వాగతం పలికిన రోజు దీపావళి.

దీపావళి పండుగను భారతదేశంలో ఉత్తరభాగంలో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపా వళి, బలి పాడ్యమి, యమద్వితీయ అని అయి దు రోజులు జరుపుకుం టారు.ధన త్రయోదశి ధన త్రయో దశినే ‘ధనత్రయోదశి లేదా ‘దన్‌తేరస్‌ గా పిలుస్తూ పండుగ సంబరాలు ప్రారంభిస్తారు.

బంగారు ఆభరణాలు కొనడానికి ఈరోజు విశేషమైందిగా విశ్వసిస్తారు. దీనిని ‘యమత్రయోదశి అని కూడా అంటారు.

ఈ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణార్థం నువ్వులనూనెతో దీపం వెలిగించి, దాన్ని పూజించి ఇంటి ముందుంచుతారు. దీన్నే ‘యమదీపం అని కూడా అంటారు.

నరక చతుర్దశి..

‘నరకాన్‌ కాయతే ఇతి నరకః అని వ్యుత్పత్తి. అనగా ప్రజల్ని చిత్ర విచిత్ర విధానాలతో బాధించే వాడెవరో అతడే నరకుడు. నేటి స్వార్థపూరితులైన నరులే సమాజాన్ని బాధించేవారు కనుక ”నరక-కులం అయ్యారు.

కాని వీరు ”నర-కులం కాదు కదా! ”నర-కులం అంటే మానవత్త్వం కల్గిన మానవులన్నమాట! ఈ నరక చతుర్దశిని ‘చిన్న దీపావళి అని అంటారు.

”తైలే లక్ష్మీః జలే గంగా దీపావళి తిథౌవసేత్‌
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


ఈ విధంగా నువ్వులనూనెలో లక్ష్మీదేవి, జలంలో గంగ తిథి ప్రకారం నిండి ఉండడం వల్ల వాటితో చేసే అభ్యంగన స్నానం అలక్ష్మిని తొలగింపచేసి, సర్వ శుభాలను ప్రసాదించడం జరుగుతుంది.

కనుక ‘స్వాతి నక్షత్రంతో కూడిన చతుర్దశి తెల్లవారుఝామున చంద్రోదయ సమయంలో నువ్వుల నూనె ఒంటికి రాసుకుని సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు పోసుకోవాలి.

స్నానానంతరం ఉత్తరేణు, సార, తగిరస ఆకులను తలమీద తిప్పుకొని పాఏయాలి.

ఇలా చేస్తే నరక భయం పోతుంది. యమధర్మరాజు నుద్దేశించి తర్పణం వదలాలి. అపుడు యమధర్మరాజును స్మరిస్తూ-యమతర్పణం వదలాలి.

తర తమ భేదం లేకుండా ప్రాణాలను హరించేవాడును, సూర్యుని కుమారుడును, శనీశ్వరునికి సోదరుడును, మరణ రహస్యాన్ని గుప్తంగా ఉంచేవాడును అయిన యమధర్మరాజుకు నమస్కార మంటూ దీప దానం చేస్తున్నానని పై శ్లోక అర్థం.

Diwali Lights

దీపావళి:

ఆశ్వయుజ మాసంలో చివరి రోజైన అమావాస్యను ‘దీపావళి పండుగగా ఆసేతు హిమాచల పర్యంతమూ వేడుకగా చేసుకుంటారు.

కోటీశ్వరుల నుంచి కూటికి లేనివాని వరకూ ఈ పండగనాడు వీలైనంత వరకు వెలుగు నింపడానికే ప్రయత్నిస్తారు.

అమావాస్య రోజున ఆచరించవలసిన కృత్యాలను గురించి వ్రత ధర్మశాస్త్ర పురాణ గ్రంథాలనుబట్టి ఇలా వివరించారు. అమావాస్యనాడు ప్రాతఃకాలాన్నే అభ్యంగన స్నానం చెయ్యాలి.

ఆ స్నానం మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలు నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయటం శుభప్రదమైంది.

ఈ అయిదు పట్టలను ‘పంచత్వక్కులంటారు. ప్రదోష కాలంలో దీపదానం చేసి, ఉల్కలను తిప్పాలి. ఉల్క లు తిప్పటమంటే గోగుపుల్లకు నూనె వత్తులు వేసి వెలిగించి చిన్నవాళ్ల చేత తిప్పిస్తారు.

తర్వాత అలక్ష్మిని తొలగించడం కోసం లక్ష్మీ పూజ చెయ్యాలి.

Diiwali-festival-Lights
Diiwali-festival-Lights

దేవాలయా లలోను, నాలుగు బాటల కూడళ్లలోను, నదుల లోను, కొండల మీదను, చెట్ల మొదళ్లలోను, పశువుల కొట్టా ల లోను, ఇళ్ల ముంగిళ్లలోను దీపా లు వెలిగించాలి.

సాయం త్రం ఆకులతో దొన్నెలు కట్టి, వాటిలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరు వుల్లో, చిన్న చిన్న కాలువల్లో విడవాలి. ద

ీపావళి రోజున శ్రీమహాలక్ష్మి దేవితో పాటు ధనాధి పతి అయిన కుబేరుణ్ణి కూడా పూజించాలి. ధనాధిపతే కానీ ధనం కాదు. మహాలక్ష్మే సాక్షాత్తు ధనం. అందుకే ఆమెకు ధనలక్ష్మి అనే పేరు వచ్చింది.

బలిపాడ్యమి:

బలిచక్రవర్తి స్థాపనతో బలిపాడ్యమి అంటే దీపావళి పండుగలోని నాలుగో రోజున చేసుకునే పర్వం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉదయం కొన్ని ప్రాంతాల్లో జూదం కూడా ఆడతారు.

గెలిచిన వారికి ఈ సంవత్స రమం తా జయప్రదంగా ఉంటుం దని జూదరుల నమ్మకం. ఆపైన గోవర్ధన పూజ చేస్తారు.

గోవర్ధన పూజ అంటే బాల్యంలో శ్రీకృష్ణుడు తన ఎడమచేతి చిటికెన వేలితో పైకెత్తి పట్టుకున్న గోవర్ధన పర్వతం అన్నమాట! ఈ పర్వతం సమీపంలో ఉన్నవారు దానికి పూజ చేస్తారు.

లేకపోతే పేడతో కానీ, అన్నపురాశితో కానీ గోవర్ధనం చేసి గోపాలునితో పాటుగా దాన్నీ పూజించాలి. ఈ రోజున ‘గోవుల ఆటలు, దీపోత్స వం, బలిపూజ, మార్గపావి బొమ్మను కట్టడం, పగ్గం లాగటం, కొత్తబట్టలు కట్టుకోవడం చేయాలి.

Diwali Lights

యమ ద్వితీయ:

కార్తిక శుద్ధ విదియనాడు అంటే బలపాడ్యమి తరువాతి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. యమద్వితీయను ”భాయీదూజ్‌ అని అంటారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండడమే ఈ పండుగ పరమార్థం.

ఈరోజు తైలలేపపనం చేసుకొని గంగా, యమునా నదుల్లో స్నానం చేయడం మంచిదని తలచి స్నానం చేస్తారు. అలా నదీ స్నానం వీలుకాకపోతే సోదరులు తమ అక్కా చెల్లెళ్ల ఇళ్లల్లో స్నానాలు చెయ్యాలి.

తిలకధారణ తర్వాత అన్నదమ్ముల కోసం వంటకా లను చేసి వారికి తినిపించాలి. సోదరునికి ఏ కష్టం కలగరాదనీ, సోదరుని ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలనీ ప్రార్థించాలి. దీన్నే ‘భగినీ హస్త భోజనమని పండుగ చేసుకుంటారు.

Celebrating Diwali

ఈ రోజున సోదరుని పూజిం చిన స్త్రీ వైధవ్యం పొందదని, సోదరునికి ఆయువు క్షీణించదని బ్రహ్మాండ పురాణం విశదీకరించింది.

అన్నాచెల్లెళ్ల పవిత్రబంధాన్ని దృఢతరం చేసే ఈ పండుగ భారతీయ జీవన మూల్యాల్లోని ఒక విశిష్ఠ లక్షణానికి ప్రతీక.

జ్ఞ్ఞాన దీపమే చైతన్య దీపావళి:

అంధత్వాన్ని ఓ చిన్న దివ్వె వెలుగు పటాపంచలు చేసినట్లు అజ్ఞానమనే చీకటిని విజ్ఞానమనే వెలుగు పారదోలుతుంది. అహంకారం అజ్ఞానంతో సమానం.

అది తొలగించుకోవటానికే జ్ఞాన సంకేతంగా దీపాన్ని వెలిగిస్తాం. అజ్ఞానాహంకారాల్ని అణగదొక్కి, జ్ఞానమనే వెలుగుల్లో పాపాల్ని ప్రక్షాళితం చేసుకోవాలి. పాపాలు లేని ఆత్మ చైతన్యపూరిత మవుతుంది.

చైతన్యమంటే వికాసం. మానవ వికాసం జరిగితే ఈ భూమి వేల వేల కాంతులీనుతూ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.

ఇదే దీపావళి అనుగ్రహించే సందేశంగా యావత్తు జగత్తూ గ్రహిస్తుంది.

ప్రతి ఏటా దీపావళి పండుగలు పలు సందేశాలను అందిస్తూ జ్ఞానబోధ చేయటం వల్ల జగతిని జాగృతం చేసే చైతన్య దీపావళి అవుతుంది.

  • ఆచార్య శ్రీవత్స

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/