మ్యాజిక్‌లో దిట్ట సుహానీ


‘యువ ప్రతిభాశాలి
పధ్నాలుగేళ్ల దాకా పుస్తకం పట్టలేదు. 29ఏళ్లకు అయిదు పుస్తకాలు రాసేసింది. జీవితంలో ఒక్కసారైనా బడికెళ్లలేదు. మూడుపదుల్లోనే 30కిపైగా దేశాలు చుట్టేసింది. పట్టుమని పదిమంది స్నేహితుల్లేరు. అంతా నోరెళ్లబెట్టేలా అయిదువేలకుపైగా ప్రదర్శనలిచ్చింది. ముంబయికి చెందిన ఈమె పేరు సుహానీ షా. దేశంలోని అతికొద్దిమంది మహిళా మెజీషియన్లలో ఒకరు. వేలమంది ప్రేక్షకులున్న వేదిక. స్టేజీ మీదకు ఒకమ్మాయిని పిలిపించి సుహానీ. వన్‌..టూ..త్రీ మనసులో అంకెలు లెక్కబెట్టిస్తూ ఆమె స్మార్ట్‌ఫోన్‌ పాస్‌కోడ్‌ చెప్పేసింది. అంతా నోరెళ్లబెట్టారు.

మ్యాజిక్‌లో దిట్ట సుహానీ

మరో షో..ఒకబ్బాయిని మనసులో మొదటి అక్షరం స్మరించమంది. తన మొదటి క్రష్‌ ఎవరో చెప్పేసింది.

ఇంతేనా కళ్లకు గంతలు కట్టుకొని ఏటిఎం బోర్డుపై రాసిన బొమ్మలు, సంజలు కనిపెట్టేయడం, మనసులో పాడుకున్న పాటని బయటికి చెప్పడం, జేబులో ఉన్న ఏటిఎం నెంబరు గుర్తించడం అలవోకగా ఇలాంటి మాయలెన్నో చేసేస్తుంది. రాజుగారి గది2 సినిమాలో అచ్చం నాగార్జున చేసినట్టే. మ్యాజిక్‌ చేయడమంటే మాటలు కాదంటోంది సుహానీ. స్టేజీ మీద ఏమాత్రం తేడా వచ్చినా మెజీషియన్లు నవ్వులపాలవుతారు. ప్రదర్శనలకు ముందు సుహానీ ఆడిటోరియం అద్దెకు తీసుకొని మరీ ప్రాక్టీస్‌ చేస్తుంది. భావోద్వేగాలు, శరీరభాష అర్ధం చేసుకోవడానికి యాభై, అరవైమందితో కలిసి మైండ్‌ రీడింగ్‌ సాధన చేస్తుంది. డ్యాన్స్‌లో కూచిపూడి, భరతనాట్యం, సాల్సా, హిప్‌హాప్‌లాంటి రకాలు ఉన్నట్టే మ్యాజిక్‌లోనూ ఎల్యూజనిస్ట్‌, మెంటలిస్ట్‌, ఎస్కోపాలజీ, స్ట్రీట్‌మ్యూజిక్‌ ఇలా రకరకాల ఆర్ట్‌ఫామ్స్‌ ఉంటాయి. వీధిలో మ్యాజిక్‌ చేయాలంటే రకరకాల సరంజామా కావాలి. సహాయకుడు ఉండాలి. మెంటలిజంకి ఇలాంటి సామాగ్రి, బాక్సులు అవసరం లేదు. దీనికి కావాల్సింది ప్రేక్షకుల చప్పట్లే. వీక్షకులమనసు పట్టేయడానికి న్యూరోలింగ్విస్టిక్‌ ప్రోగ్రామింగ్‌, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీలో నిష్ణాతులై ఉండాలంటుందామె. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు సుహానీ టీవీలో ఒక మ్యాజిక్‌ షో చూసింది. అప్పుడే పెద్దయ్యాక నేను మెజీషియన్‌ని అవుతానంది నాన్నతో. ముందు ఆయన పట్టించుకోలేదు. కానీ ఆమె ఆసక్తిని గమనించి గురువు దగ్గర చేర్పించారు. అప్పుడు ఆయన ఇచ్చిన సలహా ‘మ్యాజిక్‌ అంటే చిన్నచిన్న ట్రిక్స్‌ కాదు. ఈ ప్రపంచం అంతా నిన్ను మెచ్చుకునేలా గొప్పగా చేయాలి అన్నారు. సరేనంది. ఆర్నెళ్ల శిక్షణ, సాధన అయ్యాక అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్‌ వాఘేలా ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి దేశంలోని ప్రధాన నగరాలన్నింటితోపాటు, విదేశాల్లోనూ మాయలు చేస్తూనే ఉంది.
అడ్డంకులు దాటి..: ఇప్పటికి అయిదువేలకు పైగా షోలు చేసింది సుహానీ. అందులో కాలేజీ క్యాంపస్‌లున్నాయి. పదిహేనువేలమంది భారీ సమూహం ముందు ఇచ్చిన ప్రదర్శన ఉంది. స్కూలు,కాలేజీకి వెళ్లే సమయమే దొరకలేదు. కరోనా సాధన చేస్తూ సొంతంగా కొన్ని ట్రిక్స్‌ కనిపెట్టింది. దేశంలో పేరున్న మెజీషియన్ల దగ్గర పని చేస్తూ కిటుకులు పట్టేసింది. అయినా తనకి ఎదురైన ఇబ్బందులు తక్కువేం కాదు. ‘అమ్మాయి మ్యాజిక్‌ చేయడమేంటి? చదువు మానేసి ఊళ్లు తిరగడమేంటి? అనే చులకన మాటలు ఆమె చెవిని తాకకపోలేదు. అయినా పట్టించుకోలేదు. చిన్నప్పుడు నాన్నకిచ్చిన మాట కోసం ఎన్నో వదులుకుంది. పద్నాలుగేళ్ల దాకా చదవడం, రాయడం అసలే రాదు. తర్వాత చదువు విలువ అర్ధమై మళ్లీ పుస్తకం పట్టింది. సొంతంగా చదివింది. ఇప్పటికి అయిదు పుస్తకాలు రాసింది. చిన్నప్పటి అనుభూతులు, షోలో ఎదురైన అనుభవాఉల, ఈ కళ వివరాలన్నీ ఆ పుస్తకాల్లో ఉంటాయి. ‘ఇంద్రజాలం ఓ అరుదైన కళ. మెంటలిజం అందులో ఒక రకం. ఇందులో స్టేజఅ మీద ఎంచుకున్న వ్యక్తి శరీరభాష, కళ్ల కదలికలు, హావభావాలు పసిగట్టాలి. వాళ్ల మెదడు, మనస్తత్వం చదవాలి. మనసులోకి పరకాయ ప్రవేశం చేయాలి. దీనికోసం కఠిన సాధన అవసరం. స్టేజీ మీద మెంటలిస్ట్‌ చూపించే ఆత్మవిశ్వాసం, సందర్భోచిత వ్యాఖ్యానం సైతం షోని రక్తికట్టిస్తుంది. మనమీద మనకునమ్మకం ఉండటం, కష్టపడటం, సాధించాలనే కసి ఈ మూడు ఉంటే అమ్మాయిలు దేన్నైనా సాధించగలరు అంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/