గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ

గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తీసుకువచ్చాం..సిఎం జగన్‌

Distribution of RoFR Pattas to STs by Hon’ble CM of AP from CM Camp Office,Tadepalli 

అమరావతి: నేడు గాంధీ జయంతి సందర్భంగా ఏపి సిఎం జగన్‌ గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన ఆయన వ్యాఖ్యానిస్తూ… ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిమాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని పునరుద్ఘాటించారు. భూ వివాదాలకు ఎక్కడా తావులేని విధంగా డిజిటల్ సర్వే ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.

గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం కూడా అందిస్తామని చెప్పారు. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని, పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు. గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని సిఎం జగన్ వివరించారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తీసుకువచ్చామని పేర్కొన్నారు. పాదయాత్రలో గిరిజన ప్రాంతాలను పరిశీలించానని, ఈ క్రమంలో పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల స్థాపనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు.

అంతేకాదు, గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్న వలంటీర్లకు మద్దతుగా ఇలాచేయండి అంటూ సిఎం జగన్ ఓ సందేశం అందించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అందరూ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ వలంటీర్లను అభినందించాలని, తాను కూడా 7 గంటలకు ఇంటి నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టి అభినందిస్తానని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/