నేడు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

నేడు అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో పేదలకు సీఎం జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. CRDA పరిధిలోని 1,402 ఎకరాలను… 50,793 మంది మహిళలకు ప్రభుత్వం.. ఇళ్ల పట్టాలుగా ఈరోజు ఇవ్వనుంది. అలాగే.. CRDA ప్రాంతంలో.. రూ.443 కోట్లతో నిర్మించిన 5,024 టిట్కో ఇళ్లను కూడా ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. ఇందుకోసం గుంటూరు జిల్లా.. తుళ్లూరు మండలం.. వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 20 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 60 వేల మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు పొందుతున్న లబ్ధిదారులతోపాటు డ్వాక్రా మహిళలను సభకు సమీకరిస్తున్నారు. బహిరంగ సభా ప్రాంగణానికి ఎటువైపు నుంచి రైతులు వచ్చి నిరసన తెలుపుతారోనన్న అనుమానంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ భూముల పంపిణీ అంశంపై పెద్ద దుమారమే రేగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు.. రాజధాని నిర్మాణం కోసం ఈ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. ఐతే… వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాంతో… అమరావతిలో రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఐతే.. అమరావతిలో శాసన రాజధానిని నిర్మిస్తున్నామంటున్న ప్రభుత్వం.. అందుకు.. వేల ఎకరాల భూములు అవసరం లేదని చెబుతోంది. అందువల్ల ఆ భూములను పేదలకు పంచడం సరైన నిర్ణయంగా భావించింది.