వచ్చే నెల నుండి బతుకమ్మ చీరల పంపిణీ

ఇప్పటికే జిల్లాలకు చేరిన 50 లక్షలు 

Bathukamma-Sarees
Bathukamma-Sarees

హైదరాబాద్‌: బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 1.02 కోట్ల మంది మహిళలకు ఉచితంగా చీరలను అందజేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 20 నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. పూలపండుగ సెప్టెంబరు 28న ప్రారంభమవుతుండగా.. అంతకంటే ఒకరోజు ముందే పంపిణీని పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. బతుకమ్మ సందర్భంగా 18 ఏళ్లు దాటిన పేద మహిళలకు ప్రభుత్వం గత మూడేళ్లుగా చీరలను పంపిణీ చేస్తోంది. గత ఏడాది కంటే ఈ సారి అదనంగా ఉత్పత్తి చేసి అందజేయనున్నారు. రూ.313 కోట్లతో చీరలను సిరిసిల్లలో నేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన వాటిల్లో 50 లక్షల చీరలను జిల్లాలకు పంపించారు. మిగతావి నెలాఖరుకు పూర్తవుతాయి. జిల్లాలకు చేరిన వాటిని జిల్లా కేంద్రాల్లోని గోదాముల్లో నిల్వచేస్తున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు చేరతాయి. కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్‌ డీలర్లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా పంపిణీ జరుగుతుంది. పట్టణాలు, నగరాల్లో పుర, నగర పాలక సంస్థల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా వీటిని అందజేస్తారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/