అక్రమాస్తుల కేసులో సిబిఐ క్లీన్‌చిట్‌

అక్రమాస్తుల కేసులో సిబిఐ క్లీన్‌చిట్‌

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో వీరికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీం కోర్టులో సిబిఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అఖిలేష్‌, ములాయంపై రెగ్యులర్‌ కేసు నమోదు చేసేందుకు తమకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, అందుకే 2013 ఆగస్టులోనే ఈ కేసును మూసేసినట్లు సిబిఐ అఫిడవిట్‌లో పేర్కొంది.
ములాయం కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌ చతుర్వేది 2005లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేష్‌ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్‌లపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత కేసు నుంచి డింపుల్‌ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/