ఒక్క పాటకు 15 కోట్లా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. గతంలో తనకు ఆర్య, ఆర్య-2 వంటి హిట్‌లు అందించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ముచ్చటగా మూడోసారి ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది.

కాగా ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీడ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రానున్న పుష్పలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ కూడా ఉండనుంది. దీంతో ఈ సాంగ్‌ను స్టార్ బ్యూటీతో చేయించాలని చిత్ర యూనిట్ మొదట్నుండీ ఆలోచిస్తూ ఉంది. ఈ సినిమాలోని ఈ మాస్ పాటలో బన్నీతో కలిసి స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామ దిశా పటానీని సంప్రదించారట చిత్ర యూనిట్. అయితే ఆమె ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు భారీగా డిమాండ్ చేస్తోందట.

ఒక్క పాటలో చిందులు వేయడానికి ఏకంగా రూ.15 కోట్ల మేర రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. దీంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అసలే కరోనా కారణంగా సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవ్వడం, ఇప్పుడు ఇలా ఒక్క పాట కోసం దిశా పటానీ ఈ రేంజ్‌లో డిమాండ్ చేయడం ఏమాత్రం తగదని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. మరి పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ కోసం దిశా చెప్పిన డిమాండ్‌కు సుకుమార్ అంగీకరిస్తాడా లేక వేరే బ్యూటీకి ఆ ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.