హైకోర్టుకు చేరిన రీపోస్టుమార్టం వీడియో

High Court of Telangana
High Court of Telangana

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంలో నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు తెలంగాణ పోలీసులు. కాగా మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం జరగగా, మరోసారి పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ ప్రత్యేక బృందం మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించింది. దానికి సంబంధించి వీడియోను కూడా చిత్రీకరించింది. అయితే ఆ వీడియోను ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఎయిమ్స్‌ బృందం రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేసింది. దీంతో పాటు రీపోస్టుమార్టం వీడియో సీడీని కూడా జత చేశారు. కాగా మరోవారం రోజుల్లోగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర నివేదికను అందించనున్నట్లు తెలిసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మృతదేహాలను అణువణువునా పరిశీలించిన నిపుణులు అనుమానం కలిగిన ప్రతీ చోటా ఎక్స్‌రే తీశారు. శరీరంలో కనిపించే గాయాలతోపాటు కనిపించని గాయాలు ఉన్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా పరీక్షించారు. ఒక్కో మృతదేహానికి సుమారుగా గంటపాటు శవ పరీక్ష నిర్వహించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/