నేడు రైతులతో చర్చలు వాయిదా!

సమావేశం నిర్ణయాల ఆధారంగా రేపు చర్చలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య జరగాల్సిన పదో విడత చర్చలు వాయిదా పడ్డాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ, దాదాపు రెండు నెలలుగా హస్తిన సరిహద్దుల్లో రైతులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 9 సార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా, ఇంతవరకూ ప్రతిష్టంభన వీడలేదు. ఇక నేటి చర్చలు రేపటికి వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలూ కృతనిశ్చయంతో ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది.

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కట్టుబడివుందని, కొత్త చట్టాల ద్వారా వారికి ఏ మాత్రమూ అన్యాయం జరుగబోదన్న హామీని ఇస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బుధవారం నాడు విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి తదుపరి చర్చలు జరుగుతాయని పేర్కొంది. ఇదే సమయంలో రైతులు, కేంద్రం మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నేడు తన తొలి సమావేశాన్ని జరుపనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను అనుసరించి రైతులతో చర్చించాలని కేంద్రం భావించినందునే చర్చలను ఒకరోజు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. కాగా, రైతులతో తాము నేరుగా మాట్లాడితే పరిస్థితి వేరుగా ఉండేదని, కానీ నేతలు కల్పించుకుంటున్నందునే పరిష్కారం లభించడం లేదని వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తమ్ రుపాలా వ్యాఖ్యానించడం గమనార్హం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/