పిల్లల చదువును ఆస్తిగా చూడాలిః సిఎం జగన్‌

రూ. 694 కోట్ల విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన జగన్

YouTube video
Disbursing Financial Assistance to Students under “Jagananna Vidya Deevena” at Madanapalle LIVE

అమరావతిః సిఎం జగన్‌ ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈరోజు విద్యాదీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జులై – సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ. 694 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… పాదయాత్రలో ఇచ్చిన హామీలు తనకు గుర్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నామని చెప్పారు. ఈ పథకాల కోసం రూ. 12,401 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. పిల్లల చదువుకు పెడుతున్నదాన్ని వ్యయంగా కాకుండా, ఆస్తిగా చూడాలని చెప్పారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తాను తపన పడుతున్నానని… ఎంత మంది పిల్లలు ఉన్నా వారిని తాను చదివిస్తానని అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని జగన్ అన్నారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని చెప్పారు.

మహిళలను దగా చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదని జగన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలను వింటున్న జనం ‘ఇదేం ఖర్మరా బాబూ’ అనుకుంటున్నారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/