అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ వాయిదా

ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలని భావించిన కేంద్రం
అనేక దేశాలకు వ్యాప్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్
నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న డీజీసీఏ


న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భావించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రంగప్రవేశం నేపథ్యంలో తన నిర్ణయం మార్చుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగిస్తున్నట్టు తాజాగా ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి సడలింపు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు తిప్పలేమని, అందుకే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నామని తెలిపింది. తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని డీజీసీఏ వివరించింది. కరోనా మహమ్మారి ఉద్ధృతి కారణంగా భారత్ లో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/