ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా : డీజీసీఏ

టికెట్ ఉన్నా అనుమతించని ఎయిరిండియా

ముంబయి : చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్నా విమాన ప్రయాణానికి అనుమతించలేదంటూ ఎయిరిండియాకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) రూ.10 లక్షల జరిమానా విధించింది. విమానంలో ఎక్కనివ్వకపోవడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని కూడా అందించకపోవడం పట్ల డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో తమ నిఘా విభాగం అధికారులు తనిఖీలు చేశారని, ఎయిరిండియా తప్పిదాలు గుర్తించామని డీజీసీఏ వెల్లడించింది.

కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు నష్ట పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నా, ఎయిరిండియా ఆ నిబంధనలను పాటించలేదని డీజీసీఏ ఆరోపించింది. దీనిపై ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు పంపామని, వ్యక్తిగత విచారణ సైతం ఏర్పాటు చేశామని తెలిపింది. ఎయిరిండియాలో ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించే విధానం లేదని తెలిసిందని కూడా డీజీసీఏ పేర్కొంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించామని ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/