ప్రకృతి

ఆధ్యాత్మిక చింతన

Nature

గాలి, నీరు, నిప్పు, మట్టి, ఆకాశం పంచభూతాలుగా అనుకుంటే అందులో అణుమాత్రపు జీవి మనిషి.

గాలి శ్వాసగా ఊపిరిగా వెలసిన ఆహారం నిప్పు సహాయంతో భూమి మీద నివసిస్తూ, ప్రాణాధారంగా నీరు గ్రహిస్తూ అందమైన ఆకాశం అనే గొడుకు కింద సుఖజీవనం సాగించే మానవుడు ప్రకృతిలోని పరమార్ధాన్ని గ్రహించడం లేదు.

నిస్వార్థతకు నిలువెత్తు నిదర్శనం ప్రకృతే. కొండలు గుట్టలు జలపాతాలు, చెట్టుచేమలు, అడవులు, నదులు, సముద్రాలు, ఫలాలు, పువ్వులు ప్రకృతి ప్రసాదాలే.

ఆకాశంలో వెలిగే సూర్యచంద్రుల అనుగ్రహంతో వెలుగునూ, వెన్నులనూ, అన్నిచోట్ల సమానంగాన అనుభవించి ఆనందించే మనుషులు తమ చుట్టూ నివసించే వారి ఉనికిని భరించలేరు. ఎదుటి వారి అభివృద్ధిని సహించలేరు.

అసూయతో మగ్గిపోతూ సాటివారికి ఆటంకంగా హింసించడం పైశాచిక ఆనందంగా అనుకోవచ్చు. భగవంతుడు శిల్పిగా మలచిన ప్రకృతికి తరతమ బేధాలుండవు. అడవులలో నివసించే జంతువ్ఞలు అనవసరంగా మనుషుల జోలికి రావు.

. తమకు హాని కలిగిస్తేనే అవి ఎదుర్కొంటాయి. పుణ్యక్షేత్రాలలో సాధారణంగా గుడులు, గిరులమీద, జలపాతాల మధ్య పచ్చని వనాలతో ప్రకృతి శోభతో కనువిందు కలిగించేలా ఉంటాయి.

గంగ, యమున, కావేరి, గోదావరి, కృష్ణ పవిత్ర నదులు, ప్రపంచంలో మూడు వంతులుగా నిండిఉన్న సముద్రాలు, ఆకాశాన్నంటే కొండల ముందు, మసలే సూక్ష్మజీవులే మానవులు.

జీవితం క్షణికమని, బ్రతుకు బుద్భుద ప్రాయనమని తెలిసినా ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోకుండా అంతా తమ గొప్పగా భావిస్తూ ఉండే అల్ప మనస్కులు పరమాత్ముడి అనుగ్రహం పొందాలి.

మట్టిలో పుట్టి మట్టిలో కలిసే మానవ్ఞలు వచ్చే పోయే అద్దె ఇల్లే ఈ ప్రపంచం.

ఇది ఎవరి సొంతం కాదు. ప్రకృతే శాశ్వతం. భగవంతుడే యజమాని. నిర్దేశకుడు ఆదేశకుడు, లయకారుడు, సర్వాంతర్యామి, ప్రకృతి పర్యాయపదం పరమాత్మే.

  • యం.వి. రమణకుమారి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/