గర్వభంగం

Paandavulu with lord kirshna

మాయాజూదంలో ఓడి అడవుల పాలయిన పాండవులు ద్వైతవనంలో కాలం గడుపు తున్నారు. వారక్కడ ఎంతో హాయిగా సంతో షంగా ఉంటున్నారని వేగుల ద్వారా తెలుసు కున్న దుర్యోధనుడు అసూయతో ఊగిపోయాడు. ఎలాగైనా వారిని అవమానించాలని అను కున్నాడు. మామ శకుని సలహా మేరకు మంది మార్బలాన్ని వెంట తీసుకుని ద్వైత వనం చేరాడు. అక్కడ ఒక సరోవరంలో తన వారంతా జలక్రీడలతో మునిగిపోయి కేరింతలు కొట్ట సాగారు. వారి కేకలు కేరింతలతో ఆ ప్రాంత మంతా మారు మ్రోగిపోయింది.

వీరి ఆగడాలను గమనించిన చిత్రసేనుడనే గంధర్వుడు సరోవరం దగ్గరకొచ్చి జలకాలాడుతున్న దుర్యోధనునితో దుర్యోధనా! నీవు నీ పరివారం ఈ ద్వైత వనంలోని ప్రశాంతతను భంగపరచడం బాగు లేదు. పవిత్రమైన ఈ సరోవరాన్ని అపవిత్రం చేయడం నీకు తగదు. వెంటనే నీవు పరివారాన్ని తీసుకుని ద్వైత వనం వదిలి వెళ్లిపో అని చెప్పాడు. చిత్రసేనుడి మాటలకు కోపం వచ్చిన దుర్యోధనుడు నేనెవో తెలిసే మాట్లాడుతున్నావా? కురువంశయువరాజునైన నాతో వాదం పెట్టుకోకు. వచ్చిన దారిన వెళ్లు అన్నాడు. నీవెవరివైతే నాకేమి.

నేను చెప్పిన విధంగా వెంటనే ఈ సరోవరాన్ని, ద్వైతవనాన్ని విడిచి వెళ్లు అన్నాడు. ఆ మాటలతో మరింత కోపోద్రిక్తుడై, ఈ సరోవరాన్ని దైవ్తవనాన్ని వీడమనడానికి నీవెవరు? ఇది నీ తాతదా అంటూ అతనిపై తగాదాకు దిగాడు. కోపించిన గంధర్వుడు దుర్యోధనుడిని ఓడించి అతనిని బంధించి తన రథచక్రానికి కట్టుకుని ఆకాశమార్గాన బయలుదేరాడు.
ఇదంతా చూస్తున్న పరివారం పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని ధర్మరాజుకు చెప్పారు. ఆయన భీమార్జులను పిలిచి సోదరులారా! మీరు వెంటనే వెళ్లి ఆ గంధర్వుని బందీగా పోతున్న దుర్యోధనుని విడిపించుకు రండి అన్నాడు. గర్వంతో విర్రవీగుతున్న అతనికి తగిన శాస్తి జరిగింది. మనకెందుకులే వదిలేయండి అన్నగారూ! సంతోషంగా భీమసేనుడు.

దానికి ధర్మరాజు తప్పు తమ్ముడూ అలా అనకు. ఎంత చెడ్డా అతను మనకు దాయాది. మనలో మనకు ఎంత శతృత్వమున్నా పరాయి వాడి విషయంలో ఒకటిగా ఉండాలి. పైగా ఆపదలో ఉన్నవాడిని రక్షించడం క్షత్రియధర్మం. కనుక మీరు ఆ గంధర్వుని జయించి దుర్యోధనుని విడిపించుకురండి అన్నాడు. అన్న మాటను జవదాటని భీమార్జునులిద్దరూ వెంటనే బయలుదేరి వెళుతున్న గంధర్వుడిని నిలువరించి అతనితో యుద్ధం చేసి ఓడించారు. దుర్యోధనుణ్ణి విడిపించి గంధర్వుడిని బందీగా తీసుకొచ్చి ధర్మరాజు ఎదుట నిలిపారు.
ధర్మనందనా! నీ ఔదార్యానికి మెచ్చు కుంటున్నాను. శతృవును సైతం ఆపద నుండి కాపాడాలనే నీ ధర్మబోధ ప్రతి ఒక్కరూ ఆచరించదగినది. నేను ఇంద్రుడి కోరిక మేరకు ఈ దుర్యోధనుడి గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతో వచ్చాను.

నేను అనుకున్నది జరిగింది అని దుర్యోధనుడి వంక చూస్తూ కాలం కలిసి రాక కాగల పాలై తమ మానాన తాము జీవిస్తున్న పాండవులను అవమానపరచాలనుకోవడం మంచికాదు. వారిని అవమానించాలని వచ్చిన నీకు ఈ గర్వభంగం చాలు. బుద్ధిగా నీ పరివారాన్ని తీసుకుని హస్తినకు వెళ్లు. మరెప్పుడూ వీరిని అవమానించాలని అనుకోకు అని చెప్పి ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు గంధర్వుడు. ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించాలని వచ్చిన దుర్యోధనుడు చివరకు తానే అవమానపడి చావు తప్పి కన్నులొట్టపోయి పాండవుల దయా దాక్షిణ్యాలతో బంధవిముక్తుడై తిరిగి హస్తనకు చేరుకున్నాడు.

-ఉలాపు బాలకేశవులు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/