శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వారాంతంలో వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 38 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి సేవాసదన్‌, రాంభగీచ వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. వీరికి 36 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. భక్తుల రాక పెరుగుతున్న దృష్ట్యా దర్శనం 48 గంటలు పట్టవచ్చని తెలిపారు.

శనివారం 83,452 మంది భక్తులు దర్శించుకోగా 50వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని తెలిపారు. భక్తుల రద్దీ దృశ్యా ఆగష్టు 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీ నేపథ్యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.