యాదాద్రికి పోటెత్తిన భక్తజనం ..

కార్తీక మాసం సందర్భాంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మామూలుగానే వీకెండ్ లలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.అలాంటిది కార్తీక మాసం కావడం , ఆదివారం కావడం తో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది.

భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో స్వామివారి దర్శనానికి ధర్మ దర్శనానికి 5 గంటలు, రూ.150 దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించి, లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.