అంబటి ఫై సీఐడీకి ఫిర్యాదు చేసిన దేవినేని ఉమా

ఏపీలో రాజకీయం అంత కూడా సోషల్ మీడియా లోనే నడుస్తుంది. అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని విమర్శలు కురిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఫై టీడీపీ నేత దేవినేని ఉమా సీఐడీకి ఫిర్యాదు చేసారు. తనపై తప్పుడు ట్వీట్‌ చేసిన మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ కార్యాలయానికి వెళుతున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఒక్కరే ఫిర్యాదు కాపీతో లోపలికి వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు.

ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తూ విద్వేషాలు పెంచుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ట్విట్టర్ ఖాతాను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. ఫేక్ ట్వీట్ ను తనకు ట్యాగ్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఫేక్ ట్వీట్ల వెనుక జగన్, సజ్జల ఉన్నారని ఉమ ఆరోపించారు. నేరపూరిత కుట్ర ఆరోపణలపై సెక్షన్ల కింద జగన్, సజ్జల, అంబటిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరినట్టు తెలిపారు. కులాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. గౌతు శిరీష వంటి టీడీపీ నేతలను, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ట్వీట్ అంశంపై మౌనంగా ఉన్న అంబటి రాంబాబు తప్పు అంగీకరించినట్టుగానే భావిస్తున్నామని అన్నారు.