దేవ‌ర‌గ‌ట్టు క‌ర్రల సమరం

ఎన్ని నిబంధనలు పెట్టినా లెక్క చేయని జనం-వేల సంఖ్య‌లో చేరుకుని క‌ర్ర‌ల యుధ్ధం

Devaragattu Bunny Festival

Devara gattu (Kurnool District): ఎన్ని నిబంధనలు పెట్టినా కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం కొనసాగింది.

పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోని స్థానికులు బన్నీ ఉత్సవానికి హాజరయ్యారు.. నెరినికి, సుళువాయి విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాలవారు మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు.

ఈ కర్రల సమరంలో 27మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బన్నీ ఉత్సవం రద్దు అవుతుందని అధికారులు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయలేదు. దీంతో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రతి ఏడాది దసరా పర్వదినం ముగిసిన మరుసటి రోజు దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి దేవరగట్టు చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలు పోటీ పడుతుంటాయి..

దివిటీలు, కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఈ ఉత్సవంలో ఎంతోమంది తలలు పగులుతాయి.. జనాలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.

ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవం కొనసాగుతూ వస్తోంది. కానీ దేవరగట్టులో ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాన్ని రద్దు చేశారు..

2 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఊరిలో వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు..

ఏటా దసరా పండుగకు నిర్వహించే కర్రల సమరం బన్నీ ఉత్సవానికి బ్రేకులు వేయడానికి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సవానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. కానీ జనాలు మాత్రం లెక్క చేయలేదు. వేల సంఖ్య‌లో అక్క‌డి చేరుకుని క‌ర్ర‌ల యుద్దం చేసుకున్నారు.. పోలీసులు కూడా నిస్స‌హాయంగా ఉండిపోయారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/