కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి

మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి గా కోమటిరెడ్డి రాజగోపాల్ ఈరోజు సోమవారం నామినేషన్ దాఖలు చేసారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

నామినేష‌న్‌లో భాగంగా ఆయ‌న త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్ర‌కారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది. కోమ‌టిరెడ్డి త‌న‌కు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్న‌ట్లుగా కూడా వెల్ల‌డించారు. కోమ‌టిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా…చ‌రాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయ‌న‌ పేర్కొన్నారు. త‌న స‌తీమ‌ణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా కోమ‌టిరెడ్డి వెల్ల‌డించారు. అలాగే ఈరోజు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.