మరోసారి డెన్మార్క్ ప్రధాని పెళ్లి వాయిదా

denmark-pm-marriage-cancelled-third-time

కోహెన్‌హాగెన్‌: డెన్మార్క్‌ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్‌సన్ మూడోసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఐరోపా సమాఖ్య సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం జరగాల్సిన తన వివాహాన్ని మరోసారి వాయిదా వేశారు. గతంలో కరోనా లాక్ డౌన్ కారణాలతో వీరి వివాహం వాయిదా పడింది. ‘ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లాడేందుకు నేను ఎంతో వేచి చూస్తున్నాను’ అంటూ తన కాబోయే భర్తతో కలిసున్న చిత్రాన్ని ఆమె పోస్ట్ చేశారు. అతి త్వరలోనే తామిద్దరం ఒకటవుతామని ఆమె వ్యాఖ్యానించారు. వివాహం విషయంలో తను కూడా చాలా ఓపికతో ఉన్నారని కితాబిచ్చిన ఆమె, యూరోపియన్ కౌన్సిల్ సమావేశాలు డెన్మార్క్ కు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ‘ఎదురుచూపులు చూస్తూ ఉండటం అంత సులువు కాదు. మేము వివాహం చేసుకోవాలనుకున్న శనివారం నాడు బ్రసెల్స్ లో సమావేశానికి పిలుపునిచ్చారు. డెన్మార్క్ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడివున్న నేను, నా విధులను సక్రమంగా నిర్వర్తించాలని భావిస్తున్నాను. అందుకే పెళ్లికి మరో తేదీని నిర్ణయించుకుంటాం’ అని మిట్టే తెలిపారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/