ఏపీలో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత

విశాఖ లోని గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు పాటించకుండా నిర్మాణం జరిగిందని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామునుండి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు చేపట్టారు. .

ఉదయం ఆ ప్రాంతం మీదు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు ఒక్కసారి షాక్ అయ్యారు. రాత్రికి రాత్రే ఇలా బారికేడ్లు పెట్టి రాకపోకలకు అంతరాయం కల్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎండాడ, రుషి కొండవైపు రాకపోకలు నిలిపేశారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారో అనే సమాచారం మాత్రం ఎవరికీ తెలియక తికమక పడ్డారు.

గీతం యాజమాన్యం కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తమకు తెలియదని చెబుతోంది. ఈ హైడ్రామా కొనసాగిన కాసేపటికి ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మాణాలు తొలగింపు చేపట్టారు. దీంతో విషయం అందరికీ అర్థమైంది. ఈ కట్టడాల తొలగింపునకు గతంలోనే ప్రభుత్వం యత్నించింది. అనుమతికి మించి ఈ కట్టడాలు నిర్మించారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే కట్టడాలను కూల్చేస్తున్నట్టు అప్పట్లో పేర్కొంది. దీనిపై కోర్టుకు వెళ్లిన గీతం యాజమాన్యం స్టే తెచ్చుకుంది. ఆ స్టే గడువు ముగియడంతో ఇప్పుడు మరోసారి నిర్మాణాలు పడగొట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.