జపాన్‌ పాస్‌పోర్టు..191 దేశాల వెసులుబాటు

Japanese passport
Japanese passport

టోక్యో: జపాన్‌ పాస్‌పోర్టుకు భలే డిమాండ్‌ ఉన్నదని హెల్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ (హెచ్‌పీఐ) గురువారం వెల్లడించింది. జపాన్‌ పాస్‌పోర్టు కల్గివున్న పౌరులు వీసాలు లేకుండా 191 దేశాలు చుట్టి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌ పాస్‌పోర్టుకు భలే డిమాండ్‌ ఉన్నదని తెలిపింది. ఈ మేరకు హెచ్‌పీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలోని వివరాల ప్రకారం…పాస్‌పోర్టులకు డిమాండ్‌ ఉన్న దేశాల జాబితాలో జపాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో సింగపూర్‌, తృతీయ స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని తెలిపింది. గత మూడేండ్ల నుంచి జపాన్‌ తొలిస్థానంలోనే కొనసాగుతూ వస్తోందని తెలిపింది. అమెరికా, బ్రిటన్‌, నార్వే, గ్రీస్‌, బెల్జియం దేశాల పాస్‌పోర్టులు 8వ స్థానంలో ఉన్నాయి. 10ఏండ్ల కిందట బ్రిటన్‌ తొలిస్థానంలో నిలిచింది. క్రమక్రమంగా దీని స్థానం 8కు పడిపోయింది. అప్పట్లో బ్రిటన్‌ పాస్‌పోర్టు ఉన్నవారు 166 దేశాలు సందర్శించే అవకాశం ఉండేది. భారతీయ పాస్‌పోర్టు ఉన్నవారు 58 దేశాలకు వెళ్లేందుకు మాత్రమే అవకాశముంటుందని హెచ్‌పీఐ తెలిపింది. తమ ర్యాంకింగ్‌లో భారత్‌ 84వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. గతంలో 82వ స్థానంలో ఉన్న భారత్‌ రెండు స్థానాలకు దిగజారిందని తెలిపింది. మౌరిటేనియా, తజికిస్తాన్‌ దేశాలు కూడా 84వ స్థానాల్లో ఉన్నాయని హెచ్‌పీఐ తెలిపింది. పాకిస్తాన్‌ పాస్‌పోర్టు కల్గివున్నవారు 32 దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/