చల్లని వేళ కమ్మని సూప్‌

రుచి: వెరైటీ సూప్‌లు ‘చెలి’ పాఠకులకు ప్రత్యేకం

చిరుజల్లులు పడుతున్న వేళ వేడిగా సూప్‌ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా! ఇప్పుడు కరోనా భయపెడుతున్నది.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే తప్ప ఆ వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోలేము. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.

అయితే రోజూ ఒకేలాంటి కూరలు తినాలంటే కూడా విసుగనిపిస్తుంది. అదే కూరగాయలతో సూప్‌ చేసుకుంటే నోటికి కాస్త రుచిగా కూడా ఉంటుంది. అలాంటి కొన్ని సూప్‌లు

carrot soup

క్యారెట్‌ సూప్‌

కావాల్సిన పదార్థాలు :
క్యారెట్స్‌ – ఆరు, టమోటా గుజ్జు – రెండు టేబుల్‌ స్పూన్‌లు, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా – కొద్దిగా, అల్లం పేస్ట్‌ – పావు టీ స్పూన్‌, బటర్‌ – టీ స్పూన్‌, కొత్తిమీర – చిన్న కట్ట.

తయారు చేయు విధానం
ముందుగా క్యారెట్‌ పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో క్యారెట్‌ తురుము, టమోటాలను వేసి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి.

ఒక పాన్‌లో బటర్‌ వేసి కరిగిన తర్వాత అందులో అల్లం పేస్ట్‌, టమోటా, క్యారెట్‌ తురుము వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అందులో ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపాలి.

ఒక నిమిషం ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్‌ చేయాలి. తర్వాత దీన్ని సూప్‌ బౌల్లోకి తీసుకుని, మిరియాలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే క్యారెట్‌ సూప్‌ రెడీ.

వెజిటెబుల్‌ సూప్‌

Vegetable Soup

కావాల్సిన పదార్థాలు :
క్యారెట్‌ ముక్కలు – ఒక కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు – ఒక కప్పు, కాప్సికమ్‌ ముక్కలు ఒక కప్పు, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ – ఒక కప్పు, క్యాబేజీ – ఒక కప్పు, వెల్లుల్లి –

పావు టీ స్పూన్‌, అల్లం – పావు టీ స్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ – మూడు టీ స్పూన్‌లు, మిరియాలపొడి – అర టీ స్పూన్‌, నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్‌లు, కూరగాయలు ఉడికంచిన నీరు – రెండు కప్పులు, నూనె -తగినంత, ఉప్పు – రుచికి సరిపడినంత.

తయారు చేయు విధానం :
ముందుగా పాన్‌ తీసుకుని అందులో నూనె వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి నిమిషం వేగించుకోవాలి.

తర్వాత ఉల్లిగడ్డ, క్యారెట్‌, కాప్సికమ్‌, క్యాబేజీ, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ వేసి 10 నిమిషాలు వేగించుకోవాలి.

కూరగాయలు వేగిన తర్వాత అందులో ముందుగా కూరగాయలు ఉడికించి పెట్టుకున్న నీటిని పోయాలి. అందులోనే మిరియాల పొడి, ఉప్పు కూడా వేయాలి.

మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడు అందులో కార్న్‌ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్‌ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి.

అందులో కార్న్‌ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్‌ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి.

తర్వాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. అంతే వెజిటబుల్‌ సూప్‌ రెడీ.

స్వీట్‌ కార్న్‌ సూప్‌

Sweet Corn Soup

కావాల్సిన పదార్థాలు :
స్వీట్‌కార్న్‌ – ఒక కప్పు, ఉల్లికాడలు – అరకప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లు మూడు కప్పులు, టమోటా సాస్‌ – అయిదు చెంచాలు, దాల్చిన చెక్క – కొద్దిగా, జీలకర్ర – చెంచా, మిరియాలు – చెంచా

తయారుచేయు విధానం
ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలాగే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకుని మూటలా కట్టాలి.

ఉల్లిగడ్డ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్కజొన్నలను కూరగాయలు ఉడికించిన నీళ్లలో వేసి పొయ్యిమీద పెట్టాలి.

కొద్దిసేపటికి ఉప్పు, ఉల్లికాడలు, టమోటాసాస్‌ వేసి బాగా మరిగించాలి. సూప్‌ చిక్కగా అవుతుంది.

అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగాఉంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/