ఢిల్లీల్లో కాంగ్రెస్‌ పార్టీకి తప్పని నిరాశ!

గణనీయంగా తగ్గిన ఓటర్ల షేర్

congress party
congress flags

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చారు. సుదీర్ఘ కాలం ఢిల్లీ పీఠం ఏలిన చరిత్ర కలిగిన హస్తం పార్టీని జీరో చేసేశారు. గత ఏడాది అక్టోబరు, నవంబరులో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గణనీయంగా ఆదరించి ఆశ రేకెత్తించిన ఓటర్లు, ఢిల్లీకి వచ్చేసరికి సున్నాకే పరిమితం చేసి తీవ్ర నిరాశలో ముంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికున్న పరిస్థితి చూస్తే ఆ పార్టీ ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరమే. షీలాదీక్షిత్ వంటి నాయకులు లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో ఆప్‌ అడుగుపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి దాపురించింది. మూడో స్థానానికే పరిమితమైన ఆ పార్టీ క్రమంగా తన ఓటు షేర్‌ను కూడా కోల్పోతూ వస్తోంది. 2013లో దాదాపు 24 శాతం ఓట్‌ షేర్‌ కలిగివున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం నాలుగైదు శాతం ఓట్లకు పరిమితమయ్యిందని లెక్కలు చెబుతున్నాయి. 2015 నాటి ఎన్నికల నాటికే ఆ పార్టీ ఓట్లు పది శాతానికి పడిపోయాయి. ఈసారి పరిస్థితి మరింత దిగజారింది. ఎగ్జిట్‌ పోల్స్‌ రాగానే విరుచుకుపడిన ఆ పార్టీ నాయకులు వాస్తవ ఫలితాలు చూసి నోరు మెదపలేకపోతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/