ఢిల్లీ కోర్టులో బెయిల్‌ కోసం సిసోడియా పిటిషన్‌

Manish Sisodia-No IPL, Other Sports Event In Delhi
delhi-aaps-manish-sisodia-files-bail-plea-in-rouse-avenue-court-today

న్యూఢిల్లీః ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ రేపు (శనివారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనీశ్‌ సిసోడియా సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ స్కామ్‌కు సంబంధించిన కేసులో గత నెల 26న సీబీఐ అధికారులు మనీశ్‌ సిసోడియాను అరెస్ట్‌ చేశారు.

కాగా, మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా ఆప్‌ నేతలు నిరసనలకు దిగారు. అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి సిసోడియాను అరెస్ట్‌ చేశారంటూ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌ అక్రమమంటూ ఒక ప్రకటన చేసింది. అదానీ వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మనీశ్‌ సిసోడియాను అరెస్ట్‌ చేయించిందని ఆరోపించింది.

కాగా, గత ఆదివారం మనీశ్‌ సిసోడియాను అరెస్ట్‌ చేయగానే కోర్టులో హాజరపర్చిన సీబీఐ ఐదు రోజుల కస్టడీ కోరింది. సీబీఐ కోరినట్టుగానే మనీశ్‌ సిసోడియాను విచారించేందుకు కోర్టులో మార్చి 3 వరకు సీబీఐ కస్టడీ విధించింది. నేటితో ఆ కస్టడీ గడువు ముగిసింది. ఈ క్రమంలో సిసోడియా తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌజ్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.