భారతీయులెవరూ ఆందోళన చెందక్కర్లేదు

పౌరసత్వ సవరణ చట్టంతో ఎలాంటి నష్టం లేదు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాలు సహా పలుచోట్ల పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడి స్పందించారు. ఈ ఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని, భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాజీవితానికి ఆటంకాలు కలిగించడం సబబు కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం శతాబ్దాల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ చట్టం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఏ ప్రాంతానికి చెందిన పౌరుడికీ ఈ చట్ట సవరణ ద్వారా ఎలాంటి నష్టం జరగబోదని మరోమారు స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాల్సిన సమయమిదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని ప్రధాని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/