తగ్గుతున్న ఐటి రంగం లాభాలు

IT Employees
IT Employees

ముంబై, : భారత ఐటి పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐటి పరిశ్రమ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరంలో క్షీణించింది. టెక్‌ కంపెనీల ఆదాయం మార్చి త్రైమాసికంలో మందగించడంతో పాటు లాభం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో 20-19-20 ఆర్థిక సంవత్సరంలో టెక్‌ కంపెనీలు తమ ఆదాయాల్లో కోత విధించే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దేశంలోని అగ్ర టెక్‌ కంపెనీల మార్చి త్రైమాసిక లాభాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని బ్రోకరేజ్‌సంస్థలు సరాసరి అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు 2018న యాక్సెంచర్‌ తన వృద్ధిరేటును 11శాతంగా చూపించింది. కానీ ఈ ఏడాది మొదటి, రెండో త్రైమాసికంలో 9.5శాతం, 9 శాతానికి క్షీణించింది. దీని ఆధారంగా మూడు, నాలుగో త్రైమాసికంలో 8.5శాతం, 7 శాతంగా ఉండవచ్చునని అంచనా. ఐటి పరిశ్రమలోని ఐదు టాప్‌ కంపెనీల లాభదాయకత 4 శాతం వరకు తక్కువగా నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు. మంచి విక్రయాలు ఉన్నప్పటికీ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడం, అమెరికాలో కార్యకలాపాల వ్యయం పెరగడం, కంపెనీల నిర్వహణ వంటి అంశాల ప్రభావం లాభాలపై పడుతుంది. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌, టెక్‌ మహీంద్రా, విప్రో సంస్థల విక్రయాలు ఒకటి రెండు శాతం పెరిగినప్పటికీ, లాభం శాతం మాత్రం 100బేసిక్‌ పాయింట్ల వరకు తగ్గవచ్చునని చెబుతున్నారు. వీటితోపాటు మైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టి, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, పర్సిస్టెంట్‌ సిస్టం వంటి విక్రయాలు జనవరి-మార్చి త్రైమాసికంలో ఒక శాతం పెరగవచ్చునని అంచనా. కానీ అమెరికాలో కార్యకలాపాలకు అధిక వ్యయం అవుతోంది. దీనివల్ల లాభదాయకత తగ్గుతోంది. జనవరి-మార్చి మధ్య డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతూ వచ్చింది. ఐటి కంపెనీల నిర్వహణ లాభాలను ఇది కూడా దెబ్బతీసిందని చెబుతున్నారు. విక్రయాలు పెరిగేందుకు కూడా దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం మన టెక్‌ కంపెనీలు ఎక్కువగా డిజిటల్‌ సేవలు అందించే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కాగ్నిజెంట్‌ కంపెనీ గత ఫిబ్రవరితో ముగిసిన త్రైమాసికంలో దక్కించుకున్న కొత్త ఒప్పందాల్లో ఎక్కువ డిజిటల్‌, క్లౌడ్‌, సెక్యూరిటీ సేవలకు సంబంధించినవే.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/