ఉత్తరప్రదేశ్‌‌లో ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలి 8 మంది మృతి

ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలి 8 మంది మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా చందౌసి ప్రాంతం ఇస్లాం నగర్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. “మొత్తం ఎనిమిది మంది మరణించారు. 11 మందిని రక్షించారు. మరికొంత మంది తప్పిపోయారు. ఈ కోల్డ్ స్టోరేజ్ భవనం బేస్ మెంట్ లో ఉంది. అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు చేపట్టడంతో 11 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, నాలుగు నుంచి ఐదు మంది ఉన్న కుటుంబం ఇంకా కనిపించలేదని, వారు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కోల్డ్ స్టోరేజీ ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 11 మందిని సురక్షితంగా శిథిలాల నుంచి కాపాడారు. వారిలో కొందరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.