2000కు చేరిన కొవిడ్‌-19 మృతులు

China- coronavirus
China- coronavirus

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)మృతుల సంఖ్య 2,000 దాటింది. మంగళవారం ఈ మహమ్మారికి మరో 132 మంది బలైనట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కొత్తగా మరో 1,693 మందికి వైరస్ సోకినట్టు పేర్కొంది. హుబే ప్రావిన్సుల్లోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని, మృతుల్లో అధిక శాతం కరోనా తొలిసారి వెలుగుచూసిన వుహాన్ నగరానికి చెందినవారే ఉన్నారని తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 2,004 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 72,436కి చేరింది.

కాగా, జపాన్‌లోని యెకహోమా తీరంలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌక నిర్బంధం బుధవారంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న ఈ నౌకను యెకహోమా తీరంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలున్నట్టు అనుమానం కలిగితే 14 రోజుల నిర్బంధించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. నౌకలో విహారానికి వెళ్లిన ప్రయాణికులతోపాటు సిబ్బందికి ఇదో పీడకలగా మిగిలిపోయింది. మొత్తం 3,700 మంది ఈ నౌకలో ఉండగా, భారతీయులు 138 మంది ఉన్నారు. డైమండ్ ప్రిన్సెస్‌లో ఇప్పటి వరకు 542 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. వీరిలో ఆరుగురి భారతీయులు కూడా ఉన్నారు. బాధితులను హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. నౌక నిర్బంధం నేటితో ముగియనున్నా సిబ్బందికి మాత్రం కష్టాలు తప్పవు. ఓడలోని చివరి ప్రయాణికుడు వెళ్లేంత వరకు వీరి సేవలు కొనసాగుతాయి. సిబ్బందిలో 132 మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/