తీవ్ర ఆందోళన చెందిన దావూద్‌ ఇబ్రహీం!

Dawood Ibrahim
Dawood Ibrahim

హైదరాబాద్‌: భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. 2014 తర్వాత భారత ప్రభుత్వం దావూద్‌, అతని అనుచరులకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకొంది. ఒకప్పుడు పాక్‌లో స్వేచ్ఛగా సంచరించిన దావూద్‌ ఇప్పుడు ఐఎస్‌ఐ నీడలో రహస్య జీవితం గడుపుతున్నాడు. 2019 ఎన్నికల తర్వాత భారత్‌లో ప్రభుత్వం మారితే కొంత తెరిపిన పడవచ్చని దావూద్‌ భావించాడు. కానీ, ఇక్కడ వెలువడిన ఫలితాలను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అదే రోజు ఐఎస్‌ఐలోని కొందరు సీనియర్‌ అధికారులకు అతను ఫోన్‌ చేసి మాట్లాడాడు. మోడి ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడితే భారత్‌కు అమెరికా, ఇజ్రాయిల్‌తో సంబంధాలు మెరుగుపడితే తనకు ముప్పు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను భారత నిఘా ఏజెన్సీలకు అందకుండా సురక్షితంగా ఉంచాలని కోరాడు. తనను పాకిస్థాన్‌ నుంచి బయటకు రప్పించేందుకు ఆ సంస్థలు ఆపరేషన్‌ చేపడతాయని దావూద్‌ భావిస్తున్నాడు. ఈ అంశంపై మాజీ ఐపీఎస్‌ అధికారి పి.కె.జైన్‌ మాట్లాడుతూ భారత్‌లో మోదీ నేతృత్వంలోని సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంతో పాకిస్థాన్‌, దావూద్‌పై ఒత్తిడి పెరుగుతుందన్నారు. భారత ప్రయత్నాల్లోని తీవ్రతపైనే దావూద్‌ అప్పగింత అంశం ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/